సినిమా ప్రమోషన్ కోసం ఫ్రాంక్ వీడియో
నడి రోడ్డుపై యువకుడి హంగామా
హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించిన న్యాయవాది అరుణ్
మనతెలంగాణ, సిటిబ్యూరో: సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ చేసిన సినీనటుడు విశ్వక్ సేన్‌పై హైకోర్టు న్యాయవాది హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు చేశారు. విశ్వక్ సేన్ హీరోగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ ఈ నెల 6వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం నగరంలోని ఓ రహదారిపై ప్రాంక్ వీడియో చేసింది. ఇందులో భాగంగా ఓ యువకుడు తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని చనిపోతానంటూ బెదిరించడం కలకలం రేపింది. ‘ అర్జున్ పెళ్లి జరగాలని, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా, అన్ని అర్హతలు ఉన్న అర్జున్‌కు పెళ్లికాకపోవడం ఏంటి’ అంటూ యువకుడు నడిరోడ్డుపై హంగామా చేశాడు. అక్కడే ఉన్న విశ్వక్ సేన్ ఆ యువకుడిని ఆపే ప్రయత్నం చేశాడు.
అక్కడ ఏం జరుగుతుందో తెలియక రోడ్డుపై వెళ్తున్న వారు గందరగోళానికి గురయ్యారు. ఈ విషయం తెలిసిన హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్ రాష్ట్రమానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. విశ్వక్ సేన్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్లు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హెచ్‌ఆర్‌సిని కోరినట్లు న్యాయవాది అరుణ్‌కుమార్ తెలిపారు.