Wednesday, November 13, 2024

నెత్తిన చెత్తపోసిన ఎమ్మెల్యేపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Complaint against Shiv Sena MLA to Mumbai Police

ముంబయి: డ్రైనేజ్ కాల్వను సక్రమంగా శుభ్రం చేయనందుకు శివసేన ఎమ్మెల్యే ఆగ్రహానికి గురై నీటి మడుగుగా మారిపోయిన రోడ్డు మీద కూర్చుని నెత్తిమీద చెత్త పోయించుకున్న ఒక ప్రైవేట్ మునిసిపల్ సూపర్‌వైజర్ అనారోగ్యం పాలయ్యాడు. ఆ సంఘటన తర్వాత తనకు ఇన్ఫెక్షన్ సోకిందని, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిందని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గత శనివారం ముంబయిలోని కుర్లాకు చెందిన సంజయ్ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాను చేసిన పనిని చండీవాలి ఎమ్మెల్యే దిలీప్ లాండే సమర్థించుకున్నారు. కాంట్రాక్టర్ నల్లాను సక్రమంగా శుభ్రం చేయకపోవడం వల్లే సంజయ్ నగర్ ప్రాంతంలో రోడ్డు నీట మునిగిపోయిందని, కాంట్రాక్టర్ తన తప్పును తెలుసుకోవాలనే తాను ఈ పని చేశానని ఎమ్మెల్యే చెప్పారు.

కాగా, శనివారం తనను నీట మునిగిన రోడ్డుపైన బలవంతంగా కూర్చోపెట్టి తనపైన చెత్తను పోయడంతో తీవ్ర అస్వస్థతకు గురై శనివారం రాత్రి బోరివలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని, సోమవారం రాత్రి తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని ఒక మున్సిపల్ కాంట్రాక్టర్ వద్ద తాత్కాలిక సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న నర్పత్ కుమార్(26) ఘట్కోపర్ పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు చూడగానే ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్న తన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారని, రెండు రోజుల నుంచి వారు నిద్ర కూడా పోవడం లేదని అతను తెలిపాడు. తన కుటుంబం వద్దకు తాను ఈరోజే బయల్దేరి వెళుతున్నానని అతను తెలిపాడు. కాగా, శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే చర్యపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత ప్రవీణ్ దారేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను సమర్ధిస్తున్నారా లేదా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News