మనతెలంగాణ/హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలో అధికారులకు మామూళ్లు ఇస్తూ ఇసుకను మాయం చేస్తున్నారని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ బాధితులతో కలిసి మంగళవారం నాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇసుక మాఫియాపై క్రషర్, ఇసుక డంపింగ్లపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించకపోవడం దారుణమని అన్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే మాఫియాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలోని పోల్కంపల్లిలో ఇసుక దోపిడీ చేస్తున్న సర్పంచ్ పంచవటి శ్రీకాంత్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని యుగంధర్ డిమాండ్ చేశారు. ఇసుక అక్రమంపై ప్రశ్నించిన స్థానిక యువతపై దాడికి దిగారని, అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇసుక అక్రమ తరలింపుపై నిలదీసిన సాయిలు అనే వ్యక్తి ఇంటిపై దాడి చేయించి.. చంపుతానని బెదిరించారని ఆరోపించారు. ప్రజా సమక్షంలోనే విచారణ జరిపి.. దోచుకున్న సొమ్ము రికవరీ చేయాలని కోరారు. ఇసుక మాఫియాపై చట్టపరంగా చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Complaint in HRC Against Sand Mafia in Mahabubnagar