రాష్ట్రస్థాయిలో 9100105795
జిహెచ్‌ఎంసి పరిధిలో 040 -21111111
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆహార కల్తీ కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, గ్రామాలలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చిన్నచిన్న గ్రామాల నుంచి మొదలుకొని హైదరాబాద్ వంటి మహానగరాలలో టిఫిన్ సెంటర్లు, పానీపురి బండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వందల సంఖ్యలో వెలుస్తున్నాయి. బడా హోటళ్ల నుంచి చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్న వ్యాపారులు కనీస నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల విక్రయాల్లో కనీస నాణ్యత పాటించడం లేదని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఆహార కల్తీని కట్టడి చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు, భోజనం అందించేలా వ్యాపారులు నిబంధనలు పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో హోటళ్లు, ఇతర ఆహార కంపెనీలు, దుకాణాలు, బేకరీలు, ఆహార ఉత్పత్తి కేంద్రాల్లో కల్తీపై పోన్ నెంబర్లు లేదా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. రాష్ట్రస్థాయిలో 9100105795 ఫోన్ నెంబర్‌తో పాటు diripmtg@gmail.com, fssmtg@gmail.com ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 040 -21111111తో పాటు ఈమెయిల్ foodsafetywing.ghmc@gmail.com ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిహెచ్‌ఎంసి ఫుడ్‌సేఫ్టీ అధికారి బాలాజీ రాజు తెలిపారు.