Monday, November 18, 2024

సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయొచ్చు

- Advertisement -
- Advertisement -
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల ప్రతినిధి: ప్రతి ఒక్క పౌరుడు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.ఓటర్‌లను మభ్యపెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వాటిని లైవ్ ఫోటోలు, లైవ్ వీడియోలను సి – విజిల్ యాప్ ద్వారా తీసి పంపాలని తెలిపారు.

సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులపై వంద నిమిషాలలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని, లైవ్ ఫోటోలు, వీడియోలను తీసేటప్పుడు, అప్లోడ్ చేసే సమయంలో జి.పి.ఎస్ ఆన్‌లో ఉంచాలని, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆటోమేటిక్‌గా లోకేషన్ నమోదు అవుతుందని తెలిపారు. సభలు, సమావేశాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేసినా, పార్టీల అభ్యర్థులు పంపిణీ చేసే డబ్బులు, మద్యం, బహుమతులు లాంటి వివరాలను, అనుమతి లేకుండా నిర్వహించే ర్యాలీలు, ప్రచార వాహనాలు, ఇతరత్ర ఎన్నికల ఉల్లంఘనలపై లైవ్ ఫోటోలు, వీడియోలు సి – విజిల్ యాప్ ద్వారా పంపాలని సూచించారు. ముఖ్యంగా సి-విజిల్ యాప్‌ను యువత ఉపయోగించి ఎన్నికల్లో జరిగే అక్రమాలను, ఉల్లంఘనలను ఎన్నికల అధికారులు దృష్టికి తీసుకుని రావాలని తెలిపారు.

ఈ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో 24 గంటలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో సి-విజిల్ యాప్ ఫిర్యాదులపై పర్యవేక్షణ చేయడం జరుగుతున్నదని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను, సెల్ నెంబర్, తదితర వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. సి-విజిల్ యాప్ ను తమ ఫోన్ లలో ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలను అప్లోడ్ చేయాలని, సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, వంద నిమిషాలలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి తెలిపారు. జగిత్యాల జిల్లా పరిధిలోని కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజక వర్గాల పరిధిలో ఇప్పటి వరకు 109 ఫిర్యాదులు అందాయని, వాటిపై ఆయా రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News