నిజామాబాద్ : సంస్థాగత మార్పులు జిల్లా భారతీయ జనతా పార్టీలో చిచ్చురేపుతున్నాయి. మండల కమిటీల నియామకాలపై క్యాడర్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త కమిటీల నియామకాలలో అర్వింద్ వైఖరిని నిరసిస్తూ ఆయా నియోజక వర్గాల నేతలు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి ఇంకా కార్య క్షేత్రంలోకి దిగకముందే జిల్లా పార్టీలో నెలకొన్న రచ్చ ఆయన చెంతకు చేరింది. ఈ వ్యవహారంలో ఆయన నిస్సహాయుడిగా ఉన్నట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. జిల్లాలో 13 మండలాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు బస్వా నరసయ్య గత పది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అసలే అంతర్గత విభేదాలతో అట్టడుగుడుతున్న పార్టీలో ఈ నియామకాలు దూమారం రేపాయి.
ముఖ్యంగా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గాలకు సంబంధించిన వారికే తాజా నియామకాలలో ప్రాధాన్యత కల్పించారు.సీనియర్ నేతలైన తమకు కనీసం సమాచారం ఇవ్వకుండానే కొత్త కమిటీలు నియమించడంపై ఆగ్రహం పెల్లుబిక్కింది. ఆర్మూర్ నియోజక వర్గంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో మూడు నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నాయకులు వారం రోజుల క్రితమే హైదరాబాద్‌కు వెళ్లి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బైఠాయించారు. ఎంపి అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కిషన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. కానీ కొత్త కమిటీల నియామకాలే అమల్లోకి రావడంతో మరోసారి నిరసనలు వెల్లువెత్తాయి. సోమవారం మూడు నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు జిల్లా కార్యాలయం ఎదుట బైఠాయించి ఎంపి అర్వింద్, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మినర్సయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకొని నిరసనలు వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో 13 మండలాల కమిటీల నియామకం సీనియర్ నేతలను నొచ్చుకునేలా చేసింది. సంస్థాగత వ్యవహారంలో తన ప్రమేయం ఉండదని జిల్లా అధ్యక్షుడే నియామకాలు చేస్తారని ఎంపి అర్వింద్ ఢిల్లీలో స్పష్టం చేసినప్పటికీ అర్వింద్ సిఫార్సులతోనే కొత్త కమిటీలు నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మినర్సయ్య అంతర్గత చర్చల్లో సీనియర్‌లకు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. దీంతో సీనియర్ నేతలంతా అర్వింద్ వైఖరిని నిరసిస్తూ కిషన్‌రెడ్డితో పాటు తరుణ్ చూగ్, సంజయ్ బన్సాల్ లకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే సంస్థాగత వ్యవహారాలపై ఇంత చర్చ జరుగుతున్న కిషన్‌రెడ్డి దిద్దుబాటు చర్యలు చేయకపోవడం పార్టీలో వర్గాల్లో చర్చానీయాంశమైంది. కిషన్ రెడ్డి ఈ వ్యవహారాన్ని లైట్‌గా తీసుకోవడం వల్లే సోమవారం మరోసారి అసంతృప్తి నేతలు ఆందోళన బాట పట్టారు.