భాగ్యనగరంలో ఒకేసారి 100 మిల్లెట్ స్టోర్ల ప్రారంభం
ఆరోగ్య ప్రదాయని చిరు ధాన్యాలు : వర్ధమాన తారలు
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రస్తుత జీవనశైలికి అనుగుణమైన ఆహారం చిరు ధాన్యాలు అని టాలీవుడ్ వర్ధమాన తారలు వేద్విక, వాన్యా అగర్వాల్ అన్నారు. స్వల్ప పెట్టుబడితో 100 మంది మహిళా ఔత్సాహిక, దిగువ తరగతి ఆదాయ వర్గాల కోసం ఏర్పాటు చేసిన 100 మిల్లెట్ స్టోర్లను ఏకకాలంలో హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల ప్రఖ్యాత బిజినెస్ మెంటార్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ శ్రీనివాస్ సరకదంతో కలిసి వేద్విక, వాన్యా అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద్విక, వాన్యా అగర్వాల్‌లు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కోసం చిరు ధాన్యాల వైపు చిరువ్యాపారులను ప్రోత్సహించడానికి ఇది ఓ బృహత్తర కార్యక్రమమని అన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ సరకదం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గత 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం ప్రకటన స్ఫూర్తితో తాము నెలకొల్పిన మిల్లెట్స్ నేషనల్ పోర్టల్ (మిల్లెట్స్ డాట్ న్యూస్) ద్వారా ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులను ప్రజలకు చేరువ చేసే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో రైతులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. స్వల్ప పెట్టుబడితో మిల్లెట్ స్టోర్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఔత్సాహిక వ్యాపారులకు అండదండలు అందిస్తున్నామని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో 1,280 మండలాల్లో ఈ మిల్లెట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. మిల్లెట్ ఆధారిత ఆహారాల ద్వారా అందే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి తాము నెలకొల్పిన హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంబాసిడర్స్ ద్వారా ప్రజల ఆరోగ్య సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రస్తుతం 50 మంది వైద్యులను కలిగి ఉన్నామని, ఈ సంవత్సరాంతానికి ఆ సంఖ్యను 1000కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.