కామారెడ్డి : యోగా చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ ఆఫీస్, పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని యోగా భవనంలో బుధవారం ఉదయం తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహఙంచారు. వేడుకలకు ముఖ్య అథితిగా హాజరై జిల్లా ఎస్పీ మాట్లాడారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఉత్తమమైన సాధనం అన్నారు.
మానవులు ఉదయం లేవగానే మంచి ఆలోచనలు రావడానికి యోగా దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ యోగాసనాలు చేయడం వల ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని తెలిపారు. ఎలాంటి వ్యాధులు దరిచేరవని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన, ఉపన్యాస, పాటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే,నిజామాబాద్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ కే.శ్రీనివాసరావు, యోగా గురువులు అంజయ్య, రామ్‌రెడ్డి, అనిల్ కుమార్, అంతిరెడ్డి, వివిద రకాల యోగాసనాలు చేశారు. కామారెడ్డి పట్టణంలో ఉచిత యోగా శిక్షణ ఇచ్చిన గురువులకు ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు. జిల్లా టిఎన్జీవోఎస్ అద్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి బి.సాయిలు, జిల్లా యోగా అసోసియేషన్ ప్రతినిధులు రఘు కుమార్, అంజయ్య, వ్యాయమ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.