జాతీయ రహదారుల విభాగం, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో బండి సంజయ్ భేటీ
మనతెలంగాణ/ హైదరాబాద్ : కరీంనగర్- వరంగల్ (ఎన్‌హెచ్- 563) జాతీయ రహదారి పనుల విస్తరణ పనులను శరవేగంగా పూర్తిచేయాలని పార్లమెంట్ సభ్యులు, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎన్‌హెచ్ విభాగం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జాతీయ రహదారుల అథారిటీ పిడి మాధవి, మోహనాచారి, కమలేశ్, త్రిపాఠి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి పనుల విస్తరణ పనులు ఎంత వరకు వచ్చాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంపైనా ఆరా తీశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన బండి సంజయ్ నిర్ణీత వ్యవధిలోనే విస్తరణ పనులను పూర్తి చేయాలని కోరారు. ఇందుకోసం అవసరమైన సహాయ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. 68 కి.మీలు రహదారిని భారతమాల పరియోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం 2 వేల 146 కోట్ల 86 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిందన్నారు. ఈ నాలుగు లేన్ నిర్మాణ పనులకు సంబంధించి భూ సేకరణ కూడా పూర్తయ్యిందన్నారు. కరీంనగర్ – వరంగల్ మధ్య మొత్తం 30 గ్రామాల కవర్ అయ్యేలా ఈ 4 లేన్ రహదారి విస్తరణ పనులు కొనసాగుతునున్నాయి. ఈ విస్తరణ పనుల్లో భాగంగా 5 బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు.