న్యూఢిల్లీ: భారత్ వందకోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటున్న తరుణంలో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు మొత్తం తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులకు మొదటి డోసు పూర్తి చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. అండమాన్ నికోబార్ దీవులు, చండీగడ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, సిక్కిం, ఉత్తరాఖండ్, దాద్రానగర్, హవేలీలు, ఈ జాబితాలో ఉన్నాయి. దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 75 శాతం కంటే ఎక్కువ మంది కనీసం ఒక డోసు వేయించుకున్నట్టు చెప్పారు. 31 శాతం కంటే ఎక్కువ మందికి రెండు డోసులూ పూర్తయినట్టు తెలిపారు. దేశంలో అత్యధిక డోసులు వేసిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అక్కడ 12.30 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. తరువాతి స్థానాల్లో మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఉన్నాయి.