ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు సౌకర్యవంతం
దక్షిణమధ్య రైల్వే అధికారులు
అమరావతి: విజయవాడ టు విశాఖపట్నం సెక్షన్‌లో రాజమండ్రి రైల్వే ప్రధాన యార్డు పునర్నిర్మించబడినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. యార్డు పునర్మిర్మాణంలో భాగంగా కొత్తగా కల్పించబడిన మౌలిక సదుపాయాల అభివృద్ధితో స్టేషన్ యార్డులో ఏకకాలంలో రైలు రావడానికి, వెళ్లడానికి ఇప్పుడు సౌకర్యవంతం ఉందని అధికారులు తెలిపారు. స్టేషన్‌కు ఒక వైపు గోదావరి వంతెన మీదుగా రైళ్లు నడపడానికి ప్రస్తుతం ఉన్న స్వల్ప సమస్యలను అధిగమించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
2017, 18 సంవత్సరంలో రూ.27 కోట్ల అంచనాలతో రాజమండ్రి యార్డు పునర్నిర్మాణ పనులకు అనుమతులు మంజూ రు చేయబడ్డాయని అధికారులు తెలిపారు. స్టేషన్ సమీపంలో ఒక వైపున గోదావరి వంతెన ఉండడంతో గతంలో రైళ్ల రాకపోకలో 600 మీటర్ల దూరానికి గంటకు 15 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉండడంతో అధిక సమయం పట్టేది. దీనిని అధిగమించడానికి యార్డు పూర్తిగా మార్చడంతో పాటు ఏకకాలంలో గోదావరి వంతెన మార్గం ద్వారా వచ్చి వెళ్లే రైళ్లకు ఉపయుక్తంగా 40 పాయింట్లు, క్రాసింగ్‌ను, 260కి పైగా రూట్లతో కూడిన సెంట్రలైజ్డ్ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు 20 రోజులో పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకొని రెండు రోజుల ముందుగానే 18 రోజుల్లో పూర్తి చేశారు.
జనరల్ మేనేజర్ మార్గదర్శకంలో
దక్షిణ భారతం నుంచి తూర్పు, తూర్పు తీరానికి రైలు మార్గాన్ని అనుసంధానించడంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్రధానమైనది. దీనిని ప్రాధాన్యతను గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రత్యేక శ్రద్ధతో విజయవాడ డివిజన్ ఉన్నతాధికారులతో డివిజనల్ అధికారులతో క్రమం తప్పకుండా సంప్రదిస్తూ పనులను పర్యవేక్షించారు. జనరల్ మేనేజర్ మార్గదర్శకంలో విజయవాడ డిఆర్‌ఎమ్ ప్రత్యక్ష పరవేక్షణలో పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసినట్టుగా దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.
యార్డు పునర్నిర్మాణంలో ముఖ్యమైన అంశాలు ఇలా…
రెండు పాత లైన్లను తొలగించి 4, 5 ప్లాట్‌ఫాంపై కొత్త ప్లాట్‌ఫాం లైన్ల నిర్మాణం పూర్తి చేశారు. సరుకు రవాణా రైళ్ల కోసం 804 మీటర్ల పొడవుతో ట్రాక్ వేయడం ద్వారా అదనంగా కొత్త లైను ఏర్పాటు చేయడం. నూతన ట్రాక్ మెషిన్ సైడింగ్ అభివృద్ధి చేయడం. యాక్సిడెంట్, మెడికల్ రిలీఫ్ వ్యాన్లు నేరుగా వచ్చి వెళ్లే సౌకర్యంతో పాటు నిలిపి ఉంచడానికి కొత్త ట్రాక్ నిర్మాణం చేపట్టడం. రైళ్ల భద్రత రాకపోకలను మెరుగుపరచడానికి స్టేషన్ పరిసరాల్లో పున:రూపకల్పన చేయబడ్డాయని అధికారులు తెలిపారు. భద్రత పటిష్టతకు 263 రూట్ల సిగ్నలింగ్‌తో కూడిన అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టం ఏర్పాటు చేయడం. రైళ్ల రాకపోకల మెరుగునకు అన్ని స్టార్టప్ సిగ్నల్స్ వద్ద కాలింగ్ సిగ్నల్స్‌తో పాటు కార్ షెడ్‌కు వెళ్లేందుకు సౌకర్యవంతంగా రెండు కొత్త క్రాస్‌ఓవర్స్ ఏర్పాటు చేశారు.
ఈ పనులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయి: గజానన్ మాల్య
దక్షిణ మధ్య రైల్వేలో ప్రధాన స్టేషన్ వద్ద సాధారణ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా పనులు చేపట్టి విజయవంతంగా పనులు పూర్తి చేసిన సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందనలు తెలిపారు. రాజమండ్రి పునర్నిర్మాణ పనులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయ ని, దీనివలన రైళ్ల రాకపోకలు సులభతరం కావడంతో పాటు సరుకు రవాణా రైళ్లు మరిన్ని నడపడానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.