Friday, December 20, 2024

జమ్మూ, కశ్మీర్‌లో నియోజక వర్గాల పునర్విభజన పూర్తి

- Advertisement -
- Advertisement -

Completion of constituency redistricting in Jammu and Kashmir

తుది నివేదిక అందజేసిన కమిషన్
జమ్మూలో 43, కశ్మీర్‌లో 47 అసెంబ్లీ నియోజకవర్గాలు
తొలిసారి ఎస్‌టిలకు 9 నియోజకవర్గాలు రిజర్వ్
నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీ: జమ్మూ, కశ్మీర్ శాసన సభ నియోజక వర్గాల పునర్విభజన తుది నోటిఫికేషన్ గురువారం విడుదలైంది.ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఐదు పార్లమెంటరీ నియోజక వర్గాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ సమాన సంఖ్యలో అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. జమ్మూ ప్రాంతంలో 43, కశ్మీర్ ప్రాంతంలో 47 నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి సారి షెడ్యూల్డ్ తెగలకు శాసన సభ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు లభించాయి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని నియోజక వర్గాల పునర్విభజన కమిషన్ గురువారం సమావేశమై నివేదికకు తుది రూపం ఇచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా గురువారమే ప్రచురితమైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 90 నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు. వీటిలో జమ్మూ ప్రాంతంలో 43, కశ్మీర్ ప్రాంతంలో 47 నియోజకవర్గాలు ఉన్నాయి. షెడ్యూల్డ్ తెగలకు 9 నియోజకవర్గాలను కేటాయించారు. ఈ విధంగా ఎస్‌టిలకు జమ్మూ, కశ్మీర్‌లో రిజర్వేషన్లు లభించడం ఇదే మొదటిసారి.

కశ్మీరీ వలస వర్గాలనుంచి కనీసం ఇద్దరు సభ్యులు ఉండాలని, వీరిలో ఒకరు మహిళ ఉండాలని కమిషన్ సిఫార్సు చేసింది. పుదుచ్చేరి అసెంబ్లీలోని నామినేటెడ్ సభ్యులతో సమానంగా వారికి అధికారాలుండాలని పేర్కొంది. పునర్విభజనకు ముందు జమ్మూలో 37, కశ్మీర్‌లో 46 నియోజకవర్గాలు ఉండేవి. డీలిమిటేషన్ యాక్ట్ ,2020లోని సెక్షన్ 9(1)(ఎ), జమ్మూ, కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ,2019లోని సెక్షన్ 60(2)(బి) ప్రకారం ఈ ప్రక్రియ జరిగింది. అసోసియేట్ సభ్యులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు,సాధారణ ప్రజలు, పౌర సమాజంలోని వివిధ సంఘాలను సంప్రదించిన తర్వాత ఈ కేంద్రపాలిత ప్రాంతంలో 9 స్థానాలను ఎస్‌టిలకు కేటాయించాలని నిర్ణయించారు. వీటిలో ఆరు స్థానాలు జమ్మూ ప్రాంతంలో, మూడు స్థానాలు కశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి. జమ్మూ,కశ్మీర్‌ను కమిషన్ ఏక కేంద్రపాలిత ప్రాంతంగా డీలిమిటేషన్ పరిగణించింది. కశ్మీర్ లోయలోని అనంత్‌నాగ్, జమ్మూలోని రాజౌరి, పూంఛ్‌లను కలుపుతూ ఒక లోక్‌సభ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోను 18 చొప్పున శాసనసభ నియోజకవర్గాలుంటాయి. స్థానిక డిమాండ్ మేరకు కొన్ని నియోజకవర్గాల పేర్లను కూడా మార్చారు.

కాగా, 2018 జూన్‌నుంచి జమ్మూ, కశ్మీర్‌లో ఎన్నికైన ప్రభుత్వం అధికారంలో లేదు. 2019 ఆగస్టు 5న కేంద్రప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని జమ్మూ, కశ్మీర్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అలాగే అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన కోసం 2020లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌పి దేశాయ్ నేతృత్వంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ చందర్ భూషణ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కెకె శర్మ, ప్రధాన ఎన్నికల అధికారి హృదేశ్‌కుమార్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఏడాదిలోగా నివేదిక సమర్చించాల్సి ఉండగా కొవిడ్ కారణంగా ఆలస్యం కావడంతో ఇప్పటికే ఏడాది పాటు గడువు పెంచారు. ఈ ఏడాది మార్చి 6తో ఆ గడువు ముగియనుండగా మరో రెండు నెలలు పొడిగించారు. గడువు ముగియడానికి ఒక రోజు ముందే కమిటీ తుది నివేదిక సమర్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News