వాషింగ్టన్: అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించిన పరిమితి మేరకు 2022 ఆర్థిక సంవత్సరానికి 65,000 హెచ్–1బి వీసాలకు తగినన్ని దరఖాస్తులు అందాయని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. హెచ్–1బి వీసాల ద్వారా వేలాది మంది ఉద్యోగులను భారత్, చైనా నుంచి ఏటా అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు నియమించుకుంటున్నాయి. విదేశీ ప్రొఫెషనల్స్‌లో అత్యధికంగా డిమాండ్ ఉన్న వర్క్ వీసాలలో హెచ్–1బి వీసా ప్రధానమైనది. అమెరికన్ కాంగ్రెస్ నిర్దేశించిన మేరకు ఏటా గరిష్ఠంగా 65,000 హెచ్1బి వీసాలను అమెరికా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీంతోపాటు మరో 20,000 హెచ్-1బి వీసా యుఎస్ అడ్వాన్డ్ డిగ్రీ ఎక్సెంప్షన్(మాస్టర్స్)ను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. వీసాల కోసం వచ్చే దరఖాస్తులను ప్రతి ఏడాది పరిశీలించే యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యుఎస్‌సిఐఎస్) సోమవారం నిర్దేశించిన గరిష్ఠ పరిమితికి అవసరమైనన్ని దరఖాస్తులు తమకు అందినట్లు ప్రకటించింది. తిరస్కరణకు గురైన దరఖాస్తులకు నోటిఫికేషన్లను వారి ఆన్‌లైన్ అకౌంట్లకు పంపించే ప్రక్రియ చేపట్టినట్లు యుఎస్‌సిఐఎస్ తెలిపింది.