రూ. 46 కోట్ల ఆర్జన
కార్గో, పార్శిల్ సేవలకు పెరుగుతున్న ఆదరణ
అభినందించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రికగా దినదినాభివృద్ధి చెందుతూ అతి తక్కువ సమయంలోనే టిఎస్‌ఆర్టీసి, కార్గో, పార్సిల్ సేవలు వినియోగదారుల ఆదరణ చూరగొనటం సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సరికొత్త ఆశయం, ఆకాంక్షలతో టిఎస్‌ఆర్టీసి, కార్గో, పార్సిల్ సేవల్ని ప్రారంభించి జూన్ 19 నాటికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఉద్యోగుల నుంచి ఇ.డి.ల వరకు, ఏజెంట్ల నుంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ల వరకు అందరికీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్గో, పార్సిల్ సేవల్ని వినియోగిస్తున్న వినియోగదారులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, టిఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి, సంస్థ ఎండి సునీల్‌శర్మ మార్గనిర్దేశంలో కార్గో, పార్సిల్ సర్వీసుల ప్రత్యేక అధికారిగా ఎస్.కృష్ణకాంత్ పర్యవేక్షణలో అందిస్తున్న సేవలు సంవత్సర కాలంలోనే వినియోగదారులకు మరింత చేరువగా నిలిచాయంటూ వారిని ప్రశంసించారు.
కార్గో, పార్సిల్ సేవలు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు 32 లక్షల పార్సిల్స్ కేవలం సర్వీసు బస్సుల ద్వారా చేరవేసి రూ.34 కోట్లు, ఆపై కార్గొ బస్సుల ద్వారా రూ.12 కోట్లు అంటే మొత్తం రూ.46 కోట్లు ఆర్జించడం హర్షణీయమన్నారు. ఇతర ట్రాన్స్‌పోర్టుల కంటే తక్కువ ధర ఉండటం, పార్సిల్ బుక్ చేసిన కొద్ది గంటల్లోనే సమీప ప్రాంతాలకు చేరవేస్తూ నమ్మకాన్ని చూరగొంటోందన్నారు. 177 బస్‌స్టేషన్ కౌంటర్లు 810 ఏజెంట్లతో కొనసాగుతున్న కార్గొ, పార్సిల్ సేవలను మరింత విస్తరించే క్రమంలో రాష్ట్రంలోని ఇతర పట్టణాలలో కూడా హోం డెలివరీ సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. జంటనగరాలలో హోం డెలివరీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని, వేగంగా, భద్రంగా, మరింత చేరువగా సేవలు అందిస్తుండటంతో వినియోగదారుల ఆదరణ లభిస్తోందన్నారు.
టిఎస్ ఫుడ్స్, హార్టికల్చర్స్, బోర్డ్ ఆఫ ఇంటర్మీడియేట్, టిఎస్ టెక్ట్ బుక్స్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, సివిల్ పసప్లయ్, ఫెర్టిలైజర్స్, ఆరోగ్య శాఖ, తదితర ప్రభుత్వ శాఖలు, హెరిటేజ్, బిస్లరీ, నామ ఫార్మసిటికల్స్, దివ్య ఫార్మసిటికల్స్,. స్వామి అండ్ సన్స్ తదితర ప్రైవేట్ కంపెనీల సరుకు రవాణా కూడా టిఎస్‌ఆర్టీసీ కార్గో ద్వారా కొనసాగుతున్నాయన్నారు. సంస్థకు కండక్టర్లు, డ్రైవర్లే నిజమైన రథ సారధులని, ఎంతో కష్టపడి పని చేసే సిబ్బంది, ఉద్యోగులను ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సంస్థ ఆర్థిక స్థితిని గాడిన పెట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో మరింత కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వినియోగదారులు పార్సిల్, కార్గో సేవల్ని మరింత ఆదరించి సంస్థ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు.