Friday, January 10, 2025

కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలో మెటల్ అలర్జీల సమస్య

- Advertisement -
- Advertisement -

కీళ్ల మార్పిడి రోగుల్లో మెటల్ సెన్సిటివిటీ (లోహ సున్నితత్వం) ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఉన్న రోగులు శస్త్రచికిత్స చేయించుకునే ముందు చర్మసంబంధంగా, లేబొరేటరీ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం మెటల్ హైపర్ సెన్సిటివిటీ (లోహ తీవ్ర సున్నితత్వం) ని లేదా ప్రతికూలతలను గుర్తించడానికి ప్యాచ్ టెస్ట్ అన్నది సర్వసాధారణం. వృద్ధులు ఎక్కువగా కీళ్ల క్షీణత వ్యాధులతో సతమతమవుతుంటారు. వయసును బట్టి, ఊబశరీరం వల్ల ఈ వ్యాధులను బాగు చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. ముసలితనం వల్ల వచ్చే కీళ్ల వ్యాధికి సంబంధించి కీళ్ల మార్పిడి అవసరమైనప్పుడు లోహసంబంధ అలెర్జీలను కూడా గమనించాలి.

కీళ్ల మార్పిడి రోగుల్లో 10 నుంచి 15 శాతం మంది రోగుల్లో చర్మసంబంధ అవలక్షణాలు కనిపిస్తున్నాయి. మెటల్ హైపర్‌సెన్సిటివిటీ ప్రభావంతో అనేక అలర్జీలు ఏర్పడుతున్నాయి. ఈ రోగుల్లో కోబాల్ట్, క్రోమియం, బెరీలియం, టాంటాలమ్, టిటానియం, వనడియమ్ వంటి లోహాలు చర్మసంబంధ రుగ్మతలను కలుగ జేస్తున్న తరుణంలో మెజార్టీ కేసుల్లో నికెల్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. కృత్రిమ ఎముకలు పరికరాలతో కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేసినప్పుడు 20 శాతం కేసుల్లో అంత సంతృప్తికరమైన ఫలితాలు కనిపించడం లేదు. దీనికి కారణం మెటల్ హైపర్ సెన్సిటివిటీయే అని వైద్యులు చెబుతున్నారు. అందుకనే మెటల్ అలర్జీ రిస్కును వీలైనంతవరకు తగ్గించడానికి కొత్తగా పరికరాలను తయారు చేస్తున్నారు. కొన్ని సంస్థలు జిర్కోనియమ్, సిరామిక్, పోలీఎథిలిన్, వంటి వాటితో కృత్రిమ కీళ్లను తయారు చేసి అమర్చుతున్నారు.

కొన్ని కృత్రిమ కీళ్లను బంగారు పూత పూసిన లోహాలతో తయారు చేస్తున్నారు. దీనివల్ల లోహాలతో వచ్చే అలర్జీలు చాలా వరకు తగ్గుతున్నాయి. మెటల్ అలర్జీల కారణంగా నొప్పితోపాటు చర్మంవాపు తీవ్రంగా వేధిస్తున్నాయి. చర్మంపై దద్దుర్లు, వాపు, నొప్పి కొన్ని లోహాల వల్ల ఏర్పడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఫైబ్రోమైయాల్జియా, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ వంటివి దాపురిస్తుంటాయి. ఫ్రైబ్రోమైయాల్జియా అంటే శరీరం లోని మొత్తం కండరాలు బాధించడం. నీరసం, నిద్రలేక పోవడం, తీవ్రమైన తలనొప్పి, రుతుక్రమ సమయ నొప్పి, అవయవాల సంచలనం కోల్పోవడం, జ్ఞాపకశక్తి సమస్యలు, నిరాశగా అనిపించడం, వంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి. మెటల్ అలర్జీలు జీవితంలో సర్వసాధారణం. వాచీలు, నాణేలు, నగలు వంటివి కొందరికి అలర్జీలను కలిగిస్తుంటాయి.

వీటన్నిటికన్నా నికెల్ లోహం వల్లవచ్చే అలర్జీలు ఎక్కువగా ఉంటాయి. చర్మసంబంధ అలర్జీలు నికెల్ వల్ల కలుగుతుంటాయి. కోబాల్ట్, రాగి, క్రోమియం, కూడా అలర్జీలకు కారణాలవుతున్నాయి. క్రోమియమ్, టిటానియమ్‌తో చేసే వైద్యపరికరాలు ఏవైనా కొన్ని అలర్జీలను ప్రభావితం చేస్తుంటాయి. కృత్రిమ మోకాళ్లు, కృత్రిమ తుంటి, పేస్‌మేకర్స్, స్టెంట్లు, ఫ్రాక్చర్ ప్లేట్లు, రాడ్లు, పిన్నులు, ఇవన్నీ లోహాలతోనే ఉంటాయి. ఇవన్నీ మెటల్ హైపర్‌సెన్సిటివిటీ లక్షణాలను ప్రభావితం చేస్తుంటాయి. ఈ విధమైన రూపాలతో శరీరం లో లోహాలను అమర్చి ఎక్కువ కాలం ఉంచితే మెటల్ హైపర్ సెన్సిటివిటీకి దారి తీస్తాయి. దీనికి చికిత్స వ్యక్తిగత అలర్జీ లక్షణాల ఆధారంగా ఉంటుంది. దాంతో అమర్చిన లోహాలను తీసివేసి ప్రత్యామ్నాయ పరికరాలను అమర్చవలసి వస్తుంది. ఈ అలర్జీ ప్రభావాన్ని తగ్గించడానికి కార్టికోస్టెరాయిడ్ క్రీమ్స్, ఆయింట్‌మెంట్లను వాడాలని వైద్యులు సూచిస్తుంటారు. ఎలాగైనా మెటల్ అలర్జీలను నయం చేయడం కష్టతరం అవుతున్నందున శరీరం లో కృత్రిమ లోహ పరికరం అమర్చే ముందు హైపర్ సెన్సిటివిటీ పరీక్షచేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News