Monday, December 23, 2024

బియ్యం సేకరణపై సమగ్ర నివేదిక

- Advertisement -
- Advertisement -

Comprehensive report on rice procurement

సిఎం వద్ద త్వరలో
సమావేశం సమగ్ర
నివేదికతో సిద్ధం
అధికారులకు మంత్రుల
కమిటీ ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యా సంగి సీజన్‌కు సంబంధించి బియ్యం సేకరణపై సమగ్ర నివేదిక రూపొందించాలని మంత్రుల కమిటీ అధికారులను ఆదేశించింది. శుక్రవారం ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు, సరఫరాల శాఖ మంత్రి గంగల కమలాకర్ బిఆర్‌కె భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం సే కరణ విషయంలోతదుపరి కార్యాచరణ ఏవిధంగా ఉండాలన్నదానిపై చర్చించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసిఆర్ త్వరలోనే సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈలోగా పూర్తి వివరాలు సేకరించి సమగ్ర సమాచారంతో నివేదిక సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎఫ్‌సిఐ రాష్ట్రం నుంచి బియ్యం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టాలన్నది కూడా సమావేశంలో చర్చించారు. బియ్యం సేకరణ బాధ్యతనుంచి భారత ఆహారసంస్థ తప్పుకోలేదని , తప్పనిసరిగా ఎఫ్‌సిఐ నుంచే బియ్యం కొనుగోలు చేయించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యాసంగి ధాన్యాన్ని ఉప్పడు బియ్యంగా కాకుండా సాధారణ బియ్యంగా మారిస్తే వచ్చే వ్యత్యాసాలకు సబంధించి టెస్ట్ మిల్లింగ్ విషయంపై కూడా చర్చించారు. వివిధ జిల్లాల్లో టెస్ట్ మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతోందని, ఇది పూర్తయ్యాకే స్పష్టత వస్తుందని అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

సిఎం వద్దే కీలక నిర్ణయం :

యాసంగి బియ్యం నిల్వలకు సబంధించి ముఖ్యమంత్రి కేసిఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమావేశం అనంతరం అధికారులు తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం రైతులు నుంచి సేకరించిన యాసంగి ధాన్యాన్ని ఎఫ్‌సిఐకి అందజేసేందుకు ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కింద రైస్ మిల్లులకు అప్పగించింది. అయితే కేంద్ర ప్రభుత్వం తనిఖీల పేరుతో పెడుతున్న ఇబ్బందుల వల్ల మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియ ఆగిపోయింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్‌సిఐ మిల్లుల నుంచి బియ్యం నిల్వలు తీసుకోవడం కూడా నిలిపివేసింది.దీంతో గత 19రోజులుగా రైస్ మిల్లుల్లో ధాన్యం బస్తాల నిల్వలు పేరుకుపోయాయి.రాష్ట్రంలో 50లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం నిల్వలు మిల్లుల్లోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వరిరైతులను ఆదుకునేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ఉదారంగా ముందుకొచ్చింది. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1960చెల్లించి కోనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరించింది. కేంద్ర ప్రభుత్వం ఉప్పడు బియ్యం తీసుకోమని భీస్మించగా కేంద్రం కోరిన విధంగానే ముడిబయ్యాన్ని అందజేసేందుకు ప్రభుత్వం సిద్దపడింది.

ధాన్యం మిల్లింగ్ ప్రక్రియలో ఒక్కో క్వింటాలుకు సుమారు 35కిలోలకు పైగా తరుగు నూక కింద పోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే తరుగు నష్టాన్ని భరించి కేంద్రం కోరిన విధంగా ముడిబియ్యం అందజేస్తోంది. సిఎం కేసిఆర్ ఆదేశాలమేరకు ప్రభుత్వం ఇప్పటికే రైతుల నుంచి 49.92లక్షల మెట్రిక్ టన్నులకుపైగా కొనుగోలు చేసింది. ఈ ధాన్యానికి సబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ పైసా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే రూ.9772కోట్లకు పైగా చెల్లించేందకు నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే రూ.7464.18కోట్లకు పైగా రైతులకు చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని కూడా రేపోమాపో చెల్లించేందకు చర్యలు చేపట్టింది. ఈ పరిస్థితుల్లో ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమాత్రం సహకరించకపోగా కస్టమ్ మిల్లింగ్‌లో కొర్రీలమీద కొర్రీలు పెడుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో మిల్లుల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలపై త్వరలో సీఎం వద్ద జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుని ఈ సమస్యకు ముగింపు పలకాలని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News