పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఛండీగఢ్ : దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళన నేపధ్యంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం సింగిల్ డోసైనా వేసుకోని ప్రభుత్వోద్యోగులను బలవంతపు సెలవుపై పంపాలని నిర్ణయించింది. ఈమేరకు సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం కొవిడ్ పరిస్థితిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ నిబంధన అమలుకు ఈ నెల 15 వరకు గడువు విధించారు. ఆరోగ్య కారణాల రీత్యా వ్యాక్సిన్ తీసుకోని వారికి మినహాయింపు ఇచ్చారు. కనీసం నాలుగు వారాల ముందు వ్యాక్సిన్ వేసుకున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌నే విద్యాసంస్థలకు అనుమతిస్తూ సిఎం ఆదేశాలు జారీ చేశారు. లేనిపక్షంలో వారానికి ఒకసారి ఆర్టీపిసిఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. సిబ్బంది పూర్తిగా వ్యాక్సినేషన్ వేయించుకుంటేనే అంగన్వాడీ కేంద్రాలను తెరిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.