Monday, December 23, 2024

ప్రజాయోధుడు బి.ఎన్

- Advertisement -
- Advertisement -

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం మట్టి మనుషులను పోగుచేసి సాగించిన పోరాటం వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరా టం.ఆ పోరాట మట్టిలో పరిమళించిన అగ్రగణ్యుడు కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహ్మారెడ్డి (బి.ఎన్). 1922 మార్చి 15న ఉమ్మడి నల్గొండ జిల్లా (ప్రస్తుతం సూర్యాపేట జిల్లా) సూర్యాపేట తాలుక, తుంగతుర్తి మండలం, కర్వీరాల కొత్తగూడెంలో భీమిరెడ్డి చుక్కమ్మ రామిరెడ్డి దంపతులకు మొదటి సంతానం కామ్రేడ్ బి.యన్. పుట్టింది భూస్వామ్య కుటుంబంలో అయినా తండ్రి మాత్రం రైతుల పక్షాన వుండేవారు.ఇదే పరిస్థితి బి.యన్‌కు ఎదురైంది. తన ఇంట్లో పనిచేసే మూగపాలేరు తిండిలేక పస్తులుండి పడిపోతే పొద్దంతా పనిచేసే వారికి తిండిలేక పోవడమా? అనే ప్రశ్నలు బి.యన్. వెంటాడినాయి. తెలుగు భాషకు జరుగుతున్న అవమానాన్ని భరించలేక కొంత మంది ప్రారంభించిన ఆంధ్ర జన కేంద్ర సంఘం కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో ఆంధ్రమహాసభగా మారింది.

రాత్రి బడులు స్ధాపించాలి, తెలుగు భాషకు సమున్నత గౌరవం ఇవ్వాలి, వెట్టి చాకిరీ నిర్మూలించాలనే పేరుతో పాటు భూమి సమస్యను కూడా చేర్చబడింది.ఆంధ్ర మహాసభ పిలుపు బి.యన్‌ను పోరాటంలోకి దింపింది. 1942 వరంగల్‌లో జరిగిన 9వ ఆంధ్ర మహాసభకు బి.యన్ వాలెంటర్‌గా పని చేశారు. కమ్యూనిస్టు పార్టీ పిలుపులో గ్రామ రక్షణ దళాలు, గుత్పల సంఘాలు ఏర్పడ్డాయి. ఒడిసెల రాళ్ళలో రైతులు సమీకరణ అయ్యి పోరాటం ఆరంభించారు. దొడ్డికొమురయ్య వీర మరణం సాయుధ పోరాటానికి అంకురార్పణ అయింది. రజాకారులను, నిజాం పోలీసులను ఎదుర్కోవడానికి ప్రజలు, రైతులు ఆయుధాలు పట్టవలసి వచ్చింది. శత్రువును ఎదిరించే శిక్షణ బి.యన్‌కు వెన్నతో పెట్టిన విద్యగా ఉండేది. దళాలను ఏర్పరిచి గెరిల్లా శిక్షణ ఇవ్వడం, వ్యూహాలు, ఎత్తుగడలతో శత్రువును మట్టుపెట్టడంలో బి.యన్ పాత్ర అమోఘమైనది. పాత సూర్యాపేట, దేవరుప్పల, ఆలేరు, అలాగే కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో నిజాం రైఫిళ్లను ఎదిరించి రైతులను, ప్రజలను పోరాటం లో చైతన్యవంతంగా నడిపిన బి.యన్ పాత్ర ఘననీయమైనది.

రావులపెంట, కోటపాడు, బాల్లెంల దాడులలో ఆయుధాలు సేకరించి ప్రజలచే ఆయుధం పట్టించిన సాయుధ సేనాధి కామ్రేడ్ బి.యన్. చాకలి ఐలమ్మ పంట పొలంలోని ధాన్యాన్ని తన దళంలో దొరలను ఎదుర్కొని ఐలమ్మ ఇంటికి చేర్చారు. మొండ్రాయి, దేవరుప్పుల గ్రామాలలో జరిగిన పోరాటాలు, దొరల గడీలకు పెట్టిన ఊదర బాంబు పోరాటాలు బి.యన్ నేతృత్వంలో విజయవంతం అయ్యాయి. ‘బాన్‌చన్ నీ కాల్మొక్తా’ అన్న ప్రజలచే ఆయుధాలు చేత పట్టించిన చరిత్ర బి.యన్.ది. 1947 అధికార మార్పిడి తరువాత ఇటు నిజాం సైన్యాలతో పాటు, అటు యూనియన్ సైన్యాలతో తలబడుతూ వచ్చింది. మైదాన ప్రాంతాల నుండి పోరాటాన్ని అడవి ప్రాంతాలకు, గోదావరి పరీవాహక రెండు వైపుల దాదాపు 200 గ్రామాలకు సాయుధ పోరాటాన్ని విస్తరింపచేశారు. భూమి కోసం, భుక్తి కోసం, అణగారిన ప్రజల విముక్తి కోసం సాగిన పోరాటంలో 4 వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అనేక మంది క్షతగాత్రులు అయ్యారు.

పోరాట ఫలితంగా 10 లక్షల ఎకరాల సాగు భూమి ప్రజలకు పంచబడ్డది. 3 వేల గ్రామాలు గ్రామ స్వరాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఇంతటి చరిత్రాత్మకంగా సాగిన పోరాటంలో బి.యన్ అగ్రభాగాన ఉండి పోరాటాన్ని నడిపించి భూస్వామ్య నిరంకుశ వ్యవస్థ అంతమొందించే విధంగా అలుపెరుగని కృషి చేశారు. స్వాతంత్య్రోద్యమ అనంతరంకూడా కొనసాగిన ఈ సాయుధ పోరాటంతో భారత యూనియన్‌లో విలీనం కాని హైదరాబాద్ సంస్ధానంతో పాటు ఇంకా కొన్ని సంస్థానాలు విలీనం కావడానికి తెలంగాణలో జరిగిన ప్రజా సాయుధ తిరుగుబాటు ఒక చైతన్య దీపిక అనే చెప్పాలి. పోరాట విరామం అనంతరం భారతదేశ రాజకీయ, సామాజిక వ్యవస్థలో సమూలమైన మార్పు రావడం, ఆ మార్పుకు అగ్రగణ్యులలో కామ్రేడ్ బి.యన్. ఒకరు కావడం చరిత్రాత్మక అంశం. 1946 నుండి 1951 అక్టోబర్ వరకు విరామం ఎరుగక జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఎంతటి చరిత్ర ఉందో బి.యన్‌కు అంతే చరిత్ర వుంది. పార్టీ పోరాట విరమణ ప్రకటించాక బి.యన్ ఆదివాసీ, గ్రామీణ బహుజన ప్రజానీకం చెంత ఉంటూ వచ్చారు. హరిజన, గిరిజన, దళితవాడలలో ఉంటూ వారిని రాజకీయ వ్యవస్థకు దగ్గర చేశారు. కమ్యూనిస్టు విలువలను కాపాడేందుకు నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. సమాజంలో సాంఘిక దురాచారాలను అంతమొందించి తాను వితంతువును వివాహం ఆడి ఆదర్శాన్ని చాటారు.

ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో, ఆ తరువాత మార్క్సిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1957, 1967లో రెండు సార్లు శాసన సభ్యునిగా, 1971, 1984, 1991లలో మిర్యాలగూడ పార్లమెంట్ సభ్యునిగా ప్రజలు గెలిపించి చట్ట సభలకు పంపినారు. భూస్వామ్య, పెట్టుబడిదారీ, దోపిడీ విధానాలను, సామాజిక అణచివేతను చట్టసభలలో, బయట పాలక వర్గాలను ఎండగడుతూ వచ్చారు. బీబీనగర్ నుండి రామన్నపేట, చిట్యాల, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా నడికూడి వరకు రైలు మార్గాన్ని పోరాడి సాధించారు. బీడు భూములకు సాగునీరు అందించాలనే తపనతో తాను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడే 1996 మార్చి 6న తిరుమలగిరి (పనిగిరి) వద్ద శ్రీరాం సాగర్ రెండవ దశ కాల్వ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోదావరి నది జలాలను మళ్లించాలని కాంక్షించారు. బి.యన్ పుట్టింది భూస్వా మ్య కుటుంబంలో అయినా ఆయన మాత్రం ప్రజలు ఆర్ధిక, సామాజిక, రాజకీయ సమన్యాయం సాధించాలని తపించారు. పార్టీలో నాయకత్వ ఎంపికలో, ఎన్నికలలో అభ్యర్ధుల ఎంపికలో సామాజిక న్యాయం కొరవడిందని, అగ్ర వర్గాలకు అన్నింట్లో ఉంటున్నామని తన స్థాయి కమిటీలలో చర్చ పెట్టి పోరాడారు.

ఫలితం లేకపోవడంతో పార్టీ వీడి సిపిఎం (బి.యన్) పార్టీ ఏర్పాటు చేశారు. 1997 డిసెంబర్‌లో అన్ని సామాజిక వర్గాలను, కులాలను సమీకరించి లక్ష మందితో సూర్యాపేటలో గొప్ప సభ పెట్టినారు. ఒక కమ్యూనిస్టుగా సామాజిక శక్తులను ఒక తాటిపై తెచ్చిన ఘనత కామ్రేడ్ బి.యన్ కే దక్కింది. 1999లో ఏర్పడిన మహాజన ఫ్రంట్‌లో తన సామాజిక గొంతును కలిపారు. 2000 ఫిబ్రవరిలో పార్టీని పోరాట సహచరుడు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ స్ధాపించిన ఎంసిపిఐ (యు)లో విలీనం చేశారు. ఎంసిపిఐ (యు) పొలిట్‌బ్యూరో సభ్యునిగా, రైతు సంఘం జాతీయ నాయకునిగా కొనసాగుతూ 2008 మే 9న తాను అమరులు అయ్యే వరకు దేశ ప్రజలకు సేవలందించారు కామ్రేడ్ బి.యన్. కామ్రేడ్ బి.యన్ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎంసిపిఐ (యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 2022 మార్చి 15 నుండి 2023 మార్చి 15 వరకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో బి.యన్ శత జయంతి వార్షికోత్సవాలను కొనసాగిస్తుంది.

కార్యక్రమంలో భాగంగా 2023 జనవరి 9న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ వామపక్ష సామాజిక పార్టీ నాయకులతో పాటు మేధావులను, రచయితలను, కవులను, కళాకారులను, ప్రజలను ఆహ్వానించి ‘వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి రాజకీయ, సామాజిక అంశాలపై బి.యన్ ప్రభావం’ అనే అంశంపై సభ జరపడం జరుగుతున్నది. 2023 మార్చి 15న బి.యన్. శత జయంతి సభను సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా జరపనుంది. కామ్రేడ్ బి.యన్. రాజకీయ జీవితం భావితరాలకు ఆదర్శం. ఆయన పోరాట, రాజకీయ స్ఫూర్తిని, ఆదర్శాలను బాహ్య ప్రపంచానికి తెలుపుతూ ఆయన శతజయంతిని వార్షికోత్సవాల సందర్భాన్ని రాజకీయ, సామాజిక వ్యవస్థ మార్పుకు స్ఫూర్తి కావాలని ఆకాంక్షిస్తూ కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహ్మారెడ్డి (బి.యన్)కి విప్లవ జేజేలు తెలియజేస్తూ….

వనం సుధాకర్
9989220533

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News