ఒకవైపు మంచు తుఫానులు, మరొక వైపు కార్చిచ్చులతో కొన్ని వారాల పాటు అల్లకల్లోలమైన అమెరికాను ఇపుడు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు మరొకసారి మంచు తఫానులు, కార్చిచ్చులతో అల్లకల్లోలం చేస్తున్నాయి. అమెరికాతో పాటు ప్రపంచాన్ని కూడా. మంచు తుఫానుల రాకపై వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసే విధంగా, ట్రంప్ చర్యల విషయమై ఆయన స్వయంగానే అనేక హెచ్చరికలు జనవరి 20న పదవీ స్వీకారానికి ముందు ఎన్నికల ప్రచార సమయం నుంచి మొదలుకుని జారీ చేశారు. ఇంకా చెప్పాలంటే, అవి ఆయన మొదటి పాలనా కాలంలో (201721) ప్రదర్శించిన ధోరణులే. గత నాలుగేళ్లలో అమెరికా అంతర్గత పరిస్థితులు, బయట ప్రపంచ పరిస్థితులు ఇంకా మారినందున, ఆయన గత కాలపు ధోరణులకు మరింత తీవ్రత ఏర్పడింది. అది ఆయన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాదంతో ప్రతి ఫలించి, ఇపుడు 20వ తేదీ నుంచి తన చర్యలలో కనిపిస్తున్నది. అందువల్ల, పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్న ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులను, ఇతరత్రా ప్రకటనలను అ నేపథ్యం నుంచి చూడవలసి ఉంటుంది. ఏ దేశానికైనా, ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర దేశానికి గల విధానాలను రెండు విధాలుగా వర్గీకరించి పరిశీలించటం అవసరం. ఒకటి అంతర్గత విధానాలు, రెండు విదేశాంగ విధానాలు. అంతర్గతమైనవి ఏవైనా, విదేశాంగ విధానాల మంచి చెడులే ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో, అంతర్గత విధానాలలో కనీసం కొన్నింటికి విదేశాంగ విధానాలు ముడిబడి ఉంటుంది. ట్రంప్ విధానాలను, చర్యలను జాగ్రత్తగా గమనించినపుడు ఈ విషయం అర్థమవుతుంది.
ట్రంప్ తీసుకుంటున్న చర్యలను పరిశీలించటానికి ముందు, ఆ చర్యలకు దారి తీసిన పరిస్థితుల గురించి చెప్పుకోవాలి. అవి లోగడ చర్చించినవే అయినా ప్రస్తుత సందర్భంలో కొంత గుర్తు చేసుకోవటం అవసరం. అమెరికా సమాజం ఆర్థికంగా, సామాజికంగా సాంస్కృతికంగా, ఈ కారణాల వల్ల ఆలోచనలపరం గా రెండుగా చీలిపోయి ఉంది. సులభమైన భాషలో చెప్పాలంటే ఒకటి పైతరగతి, రెండు కింది తరగతి. ట్రంప్ ఇచ్చిన ‘మాగా’ నినాదం ఒకవైపు అమెరికా అగ్రరాజ్య ప్రయోజనాలను పరిరక్షిస్తూనే, మరొక వైపు ఈ కింది తరగతి ప్రయోజనాలకు సంబంధించినది. ఈ రెండింటికి ప్రాధాన్యత నిచ్చే వారి పూర్తి మద్దతు వల్లనే ట్రంప్ ఈసారి గెలవటంతో పాటు, రిపబ్లికన్ పార్టీకి కాంగ్రెస్ ఉభయ సభలలోనూ అసాధారణమైన రీతిలో ఆధిక్యత లభించింది.
ఈ పరిస్థితులలో ఆయన తన చర్యల ద్వారా అమెరికా అగ్రరాజ్య లేదా సామ్రాజ్యవాద, ప్రయోజనాలను పరిరక్షిస్తూ, పైన పేర్కొన్న దిగువ తరగతి మేలు కోసం పాలించవలసి ఉంటుంది. మరి ట్రంప్ చర్యలు, విధానాలు అందుకు అనుగుణంగా ఎంత వరకు ఉంటున్నాయి, వాటి ఫలితాలు ఆ లక్షాలను నెరవేర్చగలవా అన్నది ప్రధానమైన ప్రశ్న. ఆయన రాగల రోజులలో ఏమి చేయవచ్చునన్నది అట్లుంచి ఈ తొలి నాలుగు రోజులలో ఇచ్చిన ఉత్తర్వులను, చేసిన ప్రకటనలను గమనించినపుడు మిశ్రమాభిప్రాయం కలుగుతుంది. వాటిలో కొన్ని ‘మాగా’ లక్షాలకు ఉపయోగపడుతూనే హాని చేసేవి కూడా ఉన్నాయి. మరికొన్ని పూర్తిగా హాని చేసేవి ఉన్నాయి. నెరవేరటం అసాధ్యమయేమీ ఉన్నాయి. గమనించదగిన విశేషం ఏమంటే, ట్రంప్ తన చెప్పినా దానిని తానే సవరించు కుంటున్న ఉదాహరణలు సైతం ఇవే నాలుగు రోజులలో కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ‘మాగా’ నినాద సారాంశం ఆర్థికంలో ఉంది. అగ్రరాజ్య స్థాయి ప్రయోజనాలను కాపాడటమైనా, దిగువ స్థాయి అమెరికన్లకు మేలు చేయటమైనా ధనం మూలం ఇదమ్ జగత్ అన్న సూత్రం ప్రకారమే. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నింటితో అక్కర లేకుండా కొన్నిటిని మాత్రం ఉదాహరణగా తీసుకుని చూసినట్లయితే ఇవన్నీ బోధ పడతాయి. అది ఏ విధంగానో ఇపుడు చూద్దాము.
ట్రంప్ ఉత్తర్వులలో అన్నింటి కన్న ఎక్కువ సంచలనం సృష్టించినవి జన్మతో అమెరికా పౌరసత్వం లభించే నిబంధన రద్దు, అధికారిక నివాస పత్రాలు లేని విదేశీయుల పంపివేత, పనిచేసుకునే అవకాశాల కోసం అక్రమంగా ప్రవేశిస్తున్న వారిపైనే గాక అందుకోసం అధికారికంగా దరఖాస్తు చేసుకున్న వారి నిలిపివేత, హెచ్1బి తదితర వీసాలపై ఆంక్షల వంటివి ఉన్నాయి. ట్రంప్ ఎన్నకల ప్రచారాంశాలలో ఒకటి, బయటి వారు అమెరికన్ల ఉద్యోగాలను, ఆర్థికావకాశాలను “దొంగిలిస్తున్నా” రని. దానితో పాటు, వారి వల్ల అమెరికా సంస్కృతి కలుషితమవటం, శాంతి భద్రతల సమస్యలు తలెత్తటం కూడా జరుగుతున్నాయని. కనుక ఈ విధమైన చర్యల వల్ల ఆ సమస్యలు పరిష్కారం కాగలవని ట్రంప్ చెప్పదలచుకున్నారు. స్థూలదృష్టికి ఇది సరైనదిగానే తోస్తుంది. అట్లాగే ఇంత కాలం అవకాశాలు, అభివృద్ధి లేని దిగువ తరగతులకు కూడా. కాని ఈ వివిధ చర్యలకు సంబంధించి ఆచరణ సమస్యలు వెంటనే కనిపిస్తుండటంతో పాటు, వాటి అమలు వల్ల స్వయంగా అమెరికాకే ఎదురుకాగల నష్టాలు వెంటనే ముందుకు రావటం మొదలైంది. జన్మతః లభించే పౌరసత్వ నిబంధన రద్దు 14వ రాజ్యాంగ సవరణకు విరుద్ధమని, ఆ సవరణ తొలగింపు అధ్యక్షునికి కాదు గదా కాంగ్రెస్‌కు కూడా వీలు పడదని రాజ్యాంగ నిపుణలు, న్యాయశాస్త్ర నిపుణులు వెంటనే ఎత్తి చూపారు. అదిగాక, అమెరికాలోని 50 రాష్ట్రాలలో 22 రాష్ట్రాలు అదే రోజున కోర్టులకు వెళ్లాయి. బయటి వారిని పంపివేయటం, కొత్త వారిని రానివ్వకపోవటం వల్ల కూలి పనులు, ఇళ్ల పనులు, కొన్ని రకాల వృత్తి పనులు చేసే వారికి తీవ్రమైన కొరత ఏర్పడి ఆర్థికరంగం నష్టపోగల ప్రమాదం ఉందని చాలా మంది హెచ్చరిస్తున్నారు. ఇవి అక్కడి తెల్లవారు చేస్తున్నవి కావు, చేసేందుకు ఇష్టపడేవీ కావు. ఈ ఉత్తర్వుల భయంతో వ్యవసాయ ఎస్టేట్లలో పనిచేసేవారు రావటం వెంటనే ఆగిపోతున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. ఈ సమస్య పెరిగే పక్షంలో అక్కడి వ్యవసాయరంగమే గాక, వృత్తి పనుల రంగం సంక్షోభంలో పడగలదంటున్నారు. ఇక హెచ్1బి వీసాలపై ఆంక్షల వల్ల తమకే నష్టమన్న అభిప్రాయం రిపబ్లికన్ పార్టీలోనే బలంగా ఉందని, తాను కూడా వారితో ఏకీభవిస్తున్నానని ట్రంప్ ఇపుడు చెప్తున్నారు. ఆయన సన్నిహిత సలహాదారులు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిల వాదన మొదటి నుంచీ ఇదే. తమ ఆర్థికాభివృద్ధికి నిపుణులు అవసరం గనుక వారిని బయటి నుంచి ఆహ్వానించగలమని ట్రంప్ ఇపుడు తాజాగా అంటున్నారు.
దీనంతటిలోని నీతిఏమంటే, ట్రంప్ ఉత్తర్వుల పరంపరకు అమలు సమస్యలున్నాయి. అదే పద్ధతిలో తమ ఆర్థికశక్తి బలోపేతానికి పనామా కాలువను, గ్రీన్‌లాండ్‌ను బలప్రయోగం ద్వారానైనా స్వాధీన పరచుకోవటం, తమలో విలీనం కోసం కెనడాపై ఆర్థిక వత్తిడులు తేవటం చేయగలమని, వివిధ దేశాలపై దిగుమతి సుంకాలు భారీగా పెంచుతామని, ఇతరులు రష్యా, అరబ్ దేశాలకు, లాటిన్ అమెరికాకు బదులు తమ నుంచే చమురు కొనుగోలు చేయాలని, బ్రిక్స్ కూటమి డాలర్‌కు ప్రత్యామ్నాయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తే కూటమి దేశాలపై 100 శాతం సుంకాలు పెంచగలమని ఆయన హెచ్చరిస్తున్నారు. వీటిలో కొన్ని చర్యలు ఇప్పటికే ప్రారంభించారు. కాని వివరాలలోకి వెళ్లే కొద్దీ ఇందులోనూ ఎదురు కాగల సమస్యలున్నాయి. పనామా కాలువ స్వాధీనాన్ని పనామా దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, రష్యా, చైనా తదితర దేశాలు తగదంటున్నాయి. పనామా ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. గ్రీన్‌లాండ్ స్వాధీనాన్ని దానిపై సార్వభౌమాధికారం గల డెన్మార్క్, స్వయం పాలనాధికారం గల గ్రీన్‌లాండ్ ప్రభుత్వంతో పాటు, వీటికి సభ్యత్వం గల యూరోపియన్ యూనియన్‌లు ససేమిరా అంటున్నాయి. తమ ఎగుమతులపై అమెరికా సుంకాలు పెంచినట్లయితే, అమెరికా నుంచి దిగుమతులపై తామూ అదే స్థాయిలో పెంచుతామని, కొన్ని దిగుమతులను పూర్తిగా నిలిపివేయగమని చైనా తదితర దేశాలు హెచ్చరిస్తున్నాయి. చమురును ఎవరెక్కడ ఖరీదు చేయాలన్నది డబ్లుటిఒ ఒప్పందాల ప్రకారం వారు నిర్ణయించుకోవలసిందేనని గుర్తు చేస్తున్నాయి. విషయం ఏమంటే, ఇటువంటి చర్యల ద్వారా ట్రంప్ ఇతరుల ఇంటికి నిప్పు పెట్టే క్రమంలో తమ ఇంటికి కూడా నిప్పుపెట్టుకోగల ప్రమాదం కనిపిస్తున్నది. ఆయన గత పర్యాయం అధికారంలో ఉన్నపుడు చైనాపై బహిరంగ వాణిజ్య యుద్ధం ప్రకటించారు. అందుకు అమెరికన్ కంపెనీలే సహకరించుకపోవటంతో అది విఫలమైంది. ఈసారి అందుకు భిన్నంగా జరగగలదనేందుకు ఆధారాలు లేవు. అట్లాగే, బ్రిక్స్ కూటమిలో ఇప్పటికే బలమైన దేశాలుండగా, కొత్తగా చేరేందుకు అనేకం ముందుకు వస్తున్నాయి. ఆ పరిస్థితిలో ట్రంప్ బెదిరింపులు విఫలం కాక తప్పదు. ఆయన విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టదాయ కం కాగలవని కొద్ది రోజుల క్రితం ఐఎంఎఫ్ కూడా హెచ్చరించింది. పరిగణనలోకి తీసుకోదగినవి ఇంకా ఉన్నాయి గాని, ఇంత వరకు చర్చించిన ముఖ్యాంశాలను గమనించినపుడు, ట్రంప్ ఆలోచనలు, చర్యల ఉద్దేశం అమెరికాను తిరిగి గొప్పదిగా చేయటం, అక్కడి సమాజంలోని దిగువ తరగతులకు మేలు చేయటం అయితే కావచ్చుగాని, తను ఇంత వరకు జారీ చేసిన ఉత్తర్వులు, చేసిన ప్రకటనలు మాత్రం ఆచరణ రీత్యా, ఫలితాల రీత్యా అందుకు అనుగుణంగా కనిపిస్తున్నది తక్కువ. నిజంగా ఆ తరగతుల మేలు మనసులో ఉన్నవాడైతే, వారికి ఆరోగ్య సేవల వ్యవస్థను బలహీనపరిచే ఆదేశాలు ఇచ్చి ఉండేవారు కాదు. మొత్తం మీద ట్రంప్ రెండవ విడత అధికార రథానికి నల్లేరుపై బండి నడక కాబోవటం లేదు.
టంకశాల అశోక్