Wednesday, January 22, 2025

సబ్‌కా పైసా.. ఏక్ కా వికాస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసి వాటాలను కల్గివుండడంపై ఇప్పటికీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఇవేమీ పట్టించుకోకుండా అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఎల్‌ఐసి అదానీ కంపెనీల్లో మరిన్ని వాటాలను కొనుగోలు చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిలియనీర్ గౌతమ్ అదానీ మధ్య సంబంధాలపై ఆరోపణల నేపథ్యంలో తప్పనిసరిగా, అత్యవసరంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జెపిసి) వేయాలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ ట్విట్టర్ ద్వారా కోరారు. 2021 జూన్ నాటికి అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసికి మొత్తం 1.32 శాతం వాటాలు ఉన్నాయి. అయితే 2022 డిసెంబర్ నాటికి ఇది 4.23 శాతానికి పెరిగింది. అంటే 18 నెలల్లో రెట్టింపు కంటే ఎక్కువగా వాటాలను పెంచిందని కాంగ్రెస్ వెల్లడించింది.

3.57 లక్షల షేర్ల కొనుగోలు

హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ షేర్లలో భారీ పతనం కనిపించగా, దీని వల్ల ఎల్‌ఐసి హోల్డింగ్స్‌పై తీవ్ర ప్రభావం ఏర్పడిం ది. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ 2023 మార్చి ముగింపు త్రైమాసికంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో సహా 4 గ్రూప్ కంపెనీలలో ఎల్‌ఐసి తన వాటాలను పెంచుకుంది. అలాగే గ్రూప్‌లోని మూడు కంపెనీల్లో ఎల్‌ఐసి తన వాటాను తగ్గించుకుంది. గత త్రైమాసికంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ధర సగానికి పైగా పడిపో గా, అయితే ఈ సంస్థలో ఎల్‌ఐసి 357,500 షేర్లను కొనుగోలు చేసింది. ఈ విధంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎల్‌ఐసి వాటా 2023 మార్చి చివరి నాటికి 4.26 శాతానికి పెరిగింది. అయితే మార్చి త్రైమాసికంలో అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్‌లో కూడా ఎల్‌ఐసి తన వాటాను పెంచుకుంది. మరోవైపు అదానీ పోర్ట్, ఎసిసి, అంబుజాలో కంపెనీ తన వాటాను తగ్గించుకుంది. తాజా షేర్ హోల్డింగ్ ప్రకారం, అదానీ పోర్ట్‌లో ఎల్‌ఐసి వాటా డిసెంబర్ చివరి నాటికి 9.14 శాతం నుంచి 9.12 శాతానికి తగ్గింది. మరోవైపు అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 3.65 నుంచి 3.68 శాతాని కి, అదానీ గ్రీన్‌లో 1.28 శాతం నుంచి 1.35 శాతానికి, అదానీ టోటల్ గ్యాస్‌లో 5.96 శాతం నుంచి 6.02 శాతానికి పెరిగింది. అంబుజా సిమెంట్స్‌లో ఎల్‌ఐసి వాటా 6.33 శాతం నుంచి 6.29 శాతానికి, ఎసిసిలో 6.41 శాతం నుంచి 5.13 శాతానికి తగ్గింది.

57 శాతం పడిపోయిన రేటు

జనవరి చివరి నాటికి అదానీ గ్రూపు కంపెనీల్లో ఎల్‌ఐసి పెట్టుబడుల విలువ రూ.30,127 కోట్లుగా ఉంది. దీనిపై పెద్దఎత్తున దుమారం చెలరేగింది. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రభుత్వం ఎస్‌బిఐ, ఎల్‌ఐసిని ఒత్తిడి చేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టామని, మొత్తం ప్రక్రియను అనుసరించామని ఎల్‌ఐసి స్పష్టం అదానీ గ్రూప్‌లో తమ వాటాల నిర్వహణ మొత్తం ఆస్తులలో 1 శాతం కంటే తక్కువగా ఉందని ఎల్‌ఐసి వెల్లడించింది. ప్రస్తుతం అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ 2.85 శాతం పెరిగి రూ. 1,800.15 వద్ద ఉంది. దీని ఆల్ టైమ్ హై రూ.4,189.55 నుంచి 57 శాతం తగ్గింది.

ఎల్‌ఐసి కొత్త సిఐఒగా రత్నాకర్

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) తన కొత్త చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (సిఐఒ)గా రత్నాకర్ పట్నాయక్‌ను నియమించింది. రత్నాకర్ పట్నాయక్ ఏప్రిల్ 10 నుంచి సిఐఒగా బాధ్యతలు స్వీకరించారు. పీఆర్ మిశ్రా స్థానంలో రత్నాకర్ పట్నాయక్‌కు ఈ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సమాచారాన్ని ఎల్‌ఐసి వెల్లడించింది. రత్నాకర్ పట్నాయక్‌కు పరిశ్రమలో 32 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన 1990 సెప్టెంబర్‌లో ఎల్‌ఐసిలో డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్‌గా చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News