Wednesday, January 22, 2025

ముగిసిన టెన్త్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి ప్రధాన పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 3వ తేదీన టెన్త్ పరీక్షలు ప్రారంభం కాగా, ఈ నెల 13 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మంగళవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు మొత్తం 4,86,194 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,84,384 మంది(99.63 శాతం) హాజరయ్యారని ఎస్‌ఎస్‌సి బోర్డు తెలిపింది. ఈ పరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా 16 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. ఈ నెల 12న ఒఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1, ఒకేషనల్ పరీక్ష, ఈ నెల 13న ఒఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష జరుగనుంది. ఈ పరీక్షలకు సుమారు 25 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

మే రెండో వారంలో ఫలితాలు

రాష్ట్రం ఈ నెల 13వ తేదీ నుంచి పదవ తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఈ నెల 21వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు మూల్యాంకనం కొనసాగనుంది. మే 10 తర్వాత టెన్త్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. సాధారణంగా జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయిన తర్వాత సుమారు 15 రోజులలో ఫలితాలు వెల్లడిస్తారు. ఈ సారి మొత్తం 18 స్పాట్ కేంద్రాలలో మూల్యాంకనం నిర్వహించనుండగా, అందులో 17 మేజన్ స్పాట్ కేంద్రాలు, ఒకటి మైనర్ స్పాట్ కేంద్రాలు ఉన్నాయి. ఈసారి కొత్తగా మంచిర్యాల, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాలలో స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

టెన్త్ పరీక్షలలో ముగ్గురు టీచర్లకు ఉద్వాసన

పదో తరగతి పరీక్షలలో ఇన్విలేటర్లుగా విధులు నిర్వహించిన ముగ్గురు టీచర్లకు సర్వీసు నుంచి తొలగిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో తెలుగు ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసిన ఇన్విజిలేటర్ బందెప్ప.. దానిని స్వీకరించిన ఉపాధ్యాయుడు సమ్మప్ప ఇద్దరూ అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో పాఠశాల విద్యాశాఖ వారిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించింది. అలాగే హనుమకొండ కమలాపూర్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థి హిందీ ప్రశ్నాపత్రాన్ని మరో బాలుడు కిటికీ నుంచి తీసుకుని ఫొటో తీసుకున్నా గుర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇన్విజిలేటర్ సబియా మదహత్‌ను సర్వీసు నుంచి తొలగించారు. అదేవిధంగా ఈ పరీక్షలలో విధుల్లో నిర్లక్షంగా వ్యవహరించిన ఇద్దరు ఇన్విజిలేటర్లను, ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లను, ఇద్దరు డిపార్ట్‌మెంటల్ అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు ముగ్గురు ఇన్విజిలేటర్లను, ముద్దరు చీఫ్ సూపరింటెండెంట్లను, ముగ్గురు డిపార్ట్‌మెంటల్ అధికారులను విధుల నుంచి తొలగగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News