రాజేంద్రనగర్ : నెహ్రూ జూపార్కులో అక్రమం చొరబడి చెట్ల నరికివేత, గంధపు చెక్కల తస్కరణ ఘటన పై సమగ్ర విచారణ జరిపి నింధితులను గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ లోకేష్ జైస్వాల్ ఆదేశించారు. గంధం చెట్ల నరికి వేతలకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రత కొనసాగించాలని సూచించారు. శనివారం చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ జైస్వాల్ నగరంలోని నెహ్రూ జూపార్కును సందర్శించారు. ఈసందర్భంగా వన్యప్రాణుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ప్రతి వన్యప్రాణి ఆరోగ్యంగా ఉండేలా కావలసిన చర్యలు తీసుకోవాలని క్యూరేటర్ ప్రశాంత్ బాజీరావు పాటిల్‌కు చెప్పారు.
జూలోని థామీన్ డీర్ ఎన్‌క్లోజర్‌లో ఈనెల 20వ తేదీన గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి అక్రమంగా నరికి వేసి, తస్కరించిన గంధం చెట్ల ఘటనా స్థలాన్ని ఆయన డైరెక్టర్ వినయ్‌కుమార్, రాష్ట్ర ప్రధాన అటవీ అధికారి ఎఎస్‌డి ఎ. శంకరన్ తదితరులతో కలసి సందర్శించారు. చెట్ల నరికి వేతకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టి నివేధిక ఇవ్వడంతో పాటు నింధితులను గుర్తించాలని చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ క్యూరేటర్‌ను ఆదేశించారు. అనంతరం జూపార్కు గార్డెన్ అభివృద్ధి, వెటర్నరీ విభాగం జంతువులకు అందించిన వైద్య శాస్త్ర చికిత్సల సేవలకు సంబంధించి వివరాలను ఆయా విభాగాల అధికారులు చీఫ్‌వైల్డ్‌లైఫ్ వార్డెన్‌కు వివరించారు.
గంధం చెట్ల దొంగతనాలను అరికట్టెందుకు అవసరం ఉన్న చోట్ల సీసీ కెమెరాల ఏర్పాటు, జూ ప్రహారీ చుట్టూ విద్యుత్ వైర్లతో కూడిన ఫెన్సింగ్ ఏర్పాట్ల కోసం సిద్దం చేస్తున్న ప్రతిపాధనలను క్యూరేటర్ పాటిల్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌కు వివరించారు. దాంతో స్పందించిన చీఫ్‌వైల్డ్‌లైఫ్ వార్డెన్ వారం రోజుల్లో వివరణాత్మక నివేధిక సమర్పించాలని డైరెక్టర్‌తో పాటు క్యూరేటర్‌లకు చెప్పారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ క్యూరేటర్ ఎ. నాగమణి, డిప్యూటీ డైరెక్టర్( వెట్) డా. హకీమ్, అసిస్టెంట్ క్యూరేటర్లు శ్రీదేవి సరస్వతీ, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.