Thursday, November 21, 2024

స్వేచ్ఛగా.. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ : వికాస్‌రాజ్

- Advertisement -
- Advertisement -

నెలాఖరు వరకు ఓటరు నమోదుకు అవకాశం
త్వరలోనే కొత్త ఓటరు గుర్తింపు కార్డుల జారీ

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభకు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సహకారాన్ని రాజకీయ పార్టీలకు అందజేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ హామీ ఇచ్చారు. మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు షెడ్యూలు విడుదల అయిన తరువాతఇప్పటి వరకు జరిగిన అన్ని తాజా పరిణామాలను ఆయన వారికి వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సోషల్ మీడియాతో సహా ఏ అంశం పైన అయినా చేసే సహేతుకమైన ప్రతి ఫిర్యాదును సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ ఫిర్యాదులపై సమయం, శ్రమను ఆదా చేయడంతోపాటూ, వీలైనంత త్వరగా న్యాయం అందించే దిశగాస్థానికంగా వారి శక్తి సామర్ధ్యాల మేర సహకరించాలని డిఇఓలకు, ఇఓలకు ఆదేశాలు జారీ చేస్తామని వికాస్‌రాజ్ చెప్పారు. శాసనసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల తేదీ సమీపిస్తున్న తరుణంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పాటించాల్సిన నమూనా ప్రవర్తనా నియమావళి, స్టార్ క్యాంపైనర్లు, మేనిఫెస్టోలు, నామినేషన్లు, అఫిడవిట్లు, ప్రకటనల ముందస్తు ధృవీకరణలకు సంబంధించిన నియమ నిబంధనలు, అధునాతన యాప్‌ల వంటి సాంకేతిక సౌకర్యాలు, ఓటరు జాబితాల తాజా స్థితి, వాటిలో మార్పులు చేర్పులు (ఇప్పటి వరకు 14.99 లక్షల సవరణలు జరిగాయి), కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలపై వారికి వివరించారు.

దాదాపు 20 మంది రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై పలు సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేయడంలో అదనపు సిఇఓ లోకేష్‌కుమార్, జాయింట్ సిఇఓ సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సిఇఓ సత్యవాణి తదితర ఉన్నతాధికారులుఆయనకు సహకరించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి రాజకీయ పార్టీలతో ఈ నెల 14 వరకు 2100కు పైగా సమావేశాలు నిర్వహించామని వికాస్‌రాజ్ వెల్లడించారు. ఇందులో డిఈవోలు, ఈఆర్వోలు ప్రతి వారం వారితో నిర్వహించిన సమావేశాలు ఉన్నాయని వెల్లడించారు.
అక్టోబర్ చివరి నాటికి ఓటరు కార్డులు
ఈ ఏడాది జనవరి 5వ తేదీ నుంచి 27.5 లక్షలకు పైగా ఓటరు కార్డులను ముద్రించి ఓటర్లకు పంపిణీ చేశామనీ, ఈ నెలాఖరులోగా మిగిలిన ఓటరు కార్డుల ముద్రణ పూర్తి చేసి ఓటర్లకు అందజేస్తామని జాయింట్ సిఈవో సమావేశానికి తెలియజేశారు. ఓటర్లు కూడా తమంతట తాముగా ఈ-ఎపిక్ కార్డులను ఓటర్ల సేవా పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకునే కొత్త ఓటర్ల నమోదుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News