ఈ నెల 21నుంచి 24 వరకు గ్రామసభల నిర్వహణ జనవరి 26
నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఇందిరమ్మ ఆత్మీయ
భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలు
నాలుగు కొత్త పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైన ప్రభుత్వం
మన తెలంగాణ / హైదరాబాద్ : పేద ప్రజల కోసం ప్రభుత్వం మరో నాలుగు కొత్త పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. జనవరి 26 నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫీల్డ్ సర్వే ప్రారంభించింది. క్షేత్రస్థాయి నుంచి పథకాల అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు ఏడాది 12 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం చేయనుంది. ఇది కూడా జనవరి 26 నుంచి అమలు చేయనుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సైతం ప్రారంభించనుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయింది. ఇళ్ల లబ్దిదారులకు పలు విడతల్లో రూ.5లక్షల రూపాయలను ప్రభుత్వం అందించనుంది. తెలంగాణలోని ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లా, సంగారెడ్డి,మెదక్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, కామారెడ్డి ఇలా పలు జిల్లాల్లో సర్వేలు మొదలయ్యాయి.
పూర్తి స్థాయిలో అమలు చేసేలా సన్నాహాలు : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ సాయం రూ.10లక్షలకు పెంపు తదితర వాటిని అమలు చేయడంతో పాటు రైతులకు రుణమాఫీ సైతం చేసింది. అయితే మరికొన్ని పథకాలను క్షేత్రస్థాయిలో ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో మరో నాలుగు కొత్త పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది.
జనవరి 26 నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం ఫీల్ సర్వే ప్రారంభించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ఫీల్డ్ సర్వే తర్వాత ఈ నెల 21నుంచి 24 వరకు గ్రామసభలు, డేటా ఎంట్రీ చేయనున్నారు. ఈ డేటా ఆధారంగా తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.
రైతు భరోసా : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పలు అంశాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పుడు తెలంగాణలో రైతు భరోసా పథకం అమలు కానుంది. ఈనెల 26న ప్రారంభించాలని నిర్ణయించడంతో అందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం అందించబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే రైతు భరోసా పథకం పొందాలంటే భూమి సాగు ఉండాల్సి ఉంటుంది. సాగులో లేని భూములను రైతు భరోసా స్కీమ్ నుంచి పక్కనపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. రైతు భరోసా పథకం కింద సాగు చేసే ప్రతి భూములకు ప్రభుత్వం ఎకరాకు రూ.12 సాయం అందించనుంది. జనవరి 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి జనవరి 26 నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. సర్వే బృందాల దగ్గర ట్యాబ్స్ ఉంటాయి. వాటిలో రైతు భరోసా యాప్ ఉంటుంది. ఆ యాప్‌కి శాటిలైట్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం ఉంటుంది. అందువల్ల తనిఖీ బృందాలు పొలాల్లోకి వెళ్లి యాప్ ఓపెన్ చేసి భూములను గుర్తిస్తారు. అలా అత్యంత ఖచ్చితమైన పద్ధతిలో ఈ సర్వే జరుగుతుంది. ఇలా సర్వే చేసిన తర్వాత ఈ తనిఖీ బృందాలు పూర్తి వివరాలను యాప్‌లో నమోదు చేస్తాయి.
దాంతో రైతు పేరు, ఎన్ని ఎకరాలు, ఎంత మనీ ఇవ్వాలనేది జాబితా రెడీ అవుతుంది. ఈ జాబితాను జనవరి 25న ప్రభుత్వానికి ఇస్తారు. 26న ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది. ఆ డబ్బు రైతుల అకౌంట్లలో జమ అవ్వడానికి ఓ వారం నుంచి 10 రోజులు పట్టొచ్చు. తనిఖీ బృందాల్లో పంచాయతీ రాజ్, మండల రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు అంటే ఫీల్ అసిస్టెంట్, విలేజ్ అసిస్టెంట్, జీపీఎస్ స్పెషలిస్ట్, ఆర్‌ఏ, ఏఈఓలు ఉంటారు. వీళ్లు వచ్చినప్పుడు రైతులు దగ్గరే ఉండి.. పొలాలను చూపించాలి. కొన్నింటిని సాగుకి యోగ్యం కావని అధికారులు అంటే.. యోగ్యమే అని రైతు అనుకుంటే, ఎలా యోగ్యమో అధికారులకు వివరించాల్సి ఉంటుంది. సర్వే అనంతరం సాగుకుయోగ్యం కాని భూముల లిస్ట్‌ను గ్రామ పంచాయతీల్లో డిస్‌ప్లే చేస్తారు. 21 నుంచి 25 వరకు గ్రామ సభలు నిర్వహించి ఆమోదం తీసుకుంటారు. జనవరి 26న రైతు భరోసా డబ్బులను అర్హులైన రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.
కొత్త రేషన్ కార్డులు : గణతంత్ర దినోత్సవం ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత రేషన్ కార్డులు జారీ కానున్నాయి. కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు పాత రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, కమిషనర్‌లకు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం పంపిస్తారు. అనంతరం గ్రామసభల్లో జాబితాను ప్రకటించనున్నారు.
సర్వే ఆధారంగానే కొత్త రేషన్ కార్డుల జారీ : కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఈనెల 26 నుంచి రేషన్ కార్డుల మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ కార్డుల అర్హత ప్రమాణాల పరిశీలనకు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన కుల గణన సర్వే ఆధారంగానే రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా సిద్ధం చేశారు. అర్హుల ఎంపిక కోసం జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు క్షేత్రస్థాయి పరిశీలన బాధ్యతలు అప్పగించారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్‌లకు ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులను ప్రభుత్వం తెలిపింది. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శించి, చర్చించిన తర్వాతనే ఆమోదిస్తారు. ఆహార భద్రత కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు చేర్చడంతో, తొలగింపునకు కూడా అవకాశం కల్పించనున్నారు. అర్హత కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కొత్త ఆహార భద్రత కార్డులు జారీచేసేందుకు పౌరసరపరఫరాల శాఖ జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు వీరే అర్హులు : భూమిలేని నిరుపేద కూలీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సుమారుగా 10 లక్షల మంది అర్హులు ఉంటారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. భూమిలేని వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. దీనికి అనుగుణంగా కసరత్తు చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రాష్ట్రంలో 29 లక్షల మంది కూలీలకు వ్యవసాయ భూమి లేదని తేల్చింది. ఏడాదిలో కనీసంగా 20 రోజులైన ఉపాధి హామీ పనులు చేసిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దాని ప్రకారం ఉపాధి హామీ పథకంలో 2023-24 ఆర్థిక సంవత్సరం ఏడాదిలో దాదాపుగా 10 లక్షల మంది కూలీలు 20 రోజుల పాటు పనిచేసినట్లు వెల్లడైంది. ఆ లెక్కన లబ్ధిదారులకు ఆర్థిక సాయం పంపిణీ చేయడానికి ఏటా రూ.1200 కోట్ల మేరకు అవసరమవుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అంచనా వేస్తోంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయం పథకం అర్హుల నిబంధనల్లో ధరణి పొర్టల్‌లో తమ పేరుపై భూమి లేని వారు. ఉపాధి హామీ జాబ్‌కార్టు, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంకు పాస్‌బుక్‌లకు ఆధార్ కార్డు లింక్ తప్పనిసరిగా ఉండాలి.
2023 -24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి. గ్రామపంచాయతీ తీర్మానంలో అభ్యంతరాలు ఉండకూడదు. ఈ షరతులన్నింటికి అర్హులైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రెండు దశల్లో రూ.12 వేల ఆర్థిక సాయం పొందుతారు. తెలంగాణలోని ప్రతి గ్రామ పంచాయతీలో జనవరి 21 నుండి 24వ తేదీ వరకు గ్రామసభ నిర్వహిస్తారు. అందులో లబ్ధిదారుల ముసాయిదా జాబితాను చదివి వినిపిస్తారు. అనంతరం అర్హుల తుది జాబితాను ఆమోదించడం జరుగుతుంది.
ఒకవేళ గ్రామ సభలో ఎవరైనా, ఏవైనా అభ్యంతరాలు ఎదుర్కొంటే, సంబంధిత ఎంపీడీఓ వాటిని పరిశీలన చేసి, నిర్ణీత గడువు లోపు సమస్యను పూర్తిగా తెలుసుకుని పరిష్కరిస్తారు. ఈ తప్పులను ఈ నెల 25వ తేదీలోపు సవరించాలని పంచాయతీరాజ్ శాఖ, ఆయా జిల్లాల్లోని అధికారులను ఆదేశించింది. మొత్తం 6,92,921 మంది ఆధార్‌కార్డులలో తప్పులు ఉండగా 4,99,495 మంది సంబంధించిన కార్డులను సవరించారు. జాబ్ కార్డులు, బ్యాంకు పాస్‌పుస్తకాల్లో నమోదైన తప్పులను కూడా సవరిస్తున్నారు. అధికారులు నిర్ణీత గడువులోగా తప్పులను సవరిస్తారా? ఆధార్ లింక్ పూర్తవుతుందా? తమకు రూ.12 వేల సాయం అందుతుందా? అని నిరుపేద కూలీలు ఆందోళన చెందుతున్నారు.
మొత్తం 4.16 లక్షల ఇళ్లు మంజూరు : తెలంగాణలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇండ్లు మంజూరు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈనెల 26న ఈ పథకం ప్రారంభం కానుండగా అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4.16 లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన సామగ్రిపై ప్రభుత్వం దృష్టిసారించింది. మెుత్తం 4.16 లక్షల ఇండ్ల నిర్మాణానికి దాదాపుగా 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, 68 లక్షల టన్నుల స్టీల్, 101 కోట్ల ఇటుకలు, 40.50 లక్షల టన్నుల సిమెంట్ అవసరం అవుతాయని గృహ నిర్మాణశాఖ అంచనాలు రూపొందించింది. పథకం అమల్లో భాగంగా సర్కార్ మరో తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైంది.
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుకను సైతం ఉచితంగా సరఫరా చేయాలని సర్కార్ సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం ఆయా జిలాల్లో వాగులు, నదుల్లో రీచ్‌లను గుర్తించాల్సి ఉంది. సిమెంట్, స్టీల్ సరఫరాపైనా రేవంత్ ప్రభుత్వం దృష్టిసారించింది. వీటిని పెద్దమొత్తంలో ఒకేసారి తీసుకుంటే తక్కువ ధరకు ఇవ్వడానికి ముందుకు వచ్చే సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశాలున్నాయి. మొత్తంగా సిమెంట్ బస్తాను రూ.260కి, టన్ను స్టీల్‌ను రూ.54 వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించాలని ప్రణాళికలు రూపొందించింది. ఇళ్ల నిర్మాణంలో ప్రధానమైన ఇటుకలను మహిళా సంఘాల ద్వారా తయారు చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇటుకల కొరత లేకుండా చూసేందుకు.. తెలంగాణలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మండలానికి మూడు చొప్పున ఇటుక తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెర్ప్ ద్వారా ఒక్కో యూనిట్‌కు రూ.18 లక్షల వరకు రుణం అందించాలని నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్లకు ఈ యూనిట్ల ద్వారా ఇటుకలు సరఫరా చేయనుంది. సంబంధిత మార్గదర్శకాలు, ఇటుక ధరపై గృహనిర్మాణ, పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం తీసుకోనున్నాయి.