నల్లగొండ: జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులకు జిల్లా యస్.పి కె.అపూర్వ రావు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ… కోర్టు కేసులలో శిక్ష శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్ష పడేలా చేయడం ద్వారా ప్రజలకు పోలీస్ శాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందన్నారు. కేసుల్లో శిక్షల అమలు, పెండింగ్ కేసుల పరిష్కారానికి సంబంధించి పలువురు కోర్టు కానిస్టేబుళ్లను అడిగి కేసుల పురోగతిపై సూచనలు చేశారు. కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులు, వారెంట్స్, సమన్లు తదితర అంశాలను సమీక్షించారు.
కేసుల్లో నిందుతులను దోషులుగా నిరూపించి శిక్షలు పడేలా పని చేయాలని, కోర్టు అధికారులు సమన్వయంతో పని చేయడం ద్వారా సాక్షులను, నిందితులను, బాధితులను సమయానికి కోర్టులో హాజరు పరిచేలా చూసుకోవాలని చెప్పారు. నేరస్తులకు శిక్షలు పడేలా పని చేయడంలో సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారితో పాటు కోర్టు డ్యూటీ సిబ్బందికి చాలా బాధ్యత ఉంటుందని చెప్పారు. కేసు ట్రయల్స్ లలో సి.డి.లు నమోదు చేసుకోవాలన్నారు. బాధితులకు, సాక్షులకు కేసుకు సంబంధించిన విషయాలలో అవగాహన కల్పించాలని తెలిపారు. కోర్టు కేసుల్లో నిందుతులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందుకు అనుగుణంగా కేసులు పెండింగులో లేకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బీ డిఎస్పీ రమేష్ సిఐ రాఘవులు ఐటి సెల్ సుదర్శన్ చారి, జిల్లాలోని పోలీస్ స్టేషన్ల కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.