న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. దేశ రాజధాని మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న శరీర భాగాలు శ్రద్ధా వాకర్‌వేనని నిర్ధారణ అయింది. ఆమె తండ్రి నుంచి సేకరించిన డీఎన్‌ఏ నమూనాతో అవి సరిపోలినట్టు తాజా నివేదికలో వెల్లడైంది. వివిధ ప్రాంతాల్లో లభించిన ఎముకల డీఎన్‌ఏ నివేదిక పోలీసులకు చేరింది. అవి శ్రద్ధావాకర్ తండ్రి నమూనాతో సరిపోలాయని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు శ్రద్ధా వాకర్ హత్య కేసులో వాస్తవాలను ధ్రువీకరించుకునేందుకు ఢిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే ఆఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్‌తోపాటు నార్కో పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఆమె శరీరాన్ని 35 భాగాలుగా చేసి పడవేసినట్టు అనుమానిస్తుండగా, వాటిలో ఇప్పటివరకు 13 భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగతా వాటికోసం గాలిస్తున్నారు. మరోవైపు తన కుమార్తెను అతి దారుణంగా హత్య చేసిన ఆఫ్తాబ్ పూనావాలా ను ఉరి తీయాలని శ్రద్ధావాకర్ తండ్రి వికాస్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర పోలీసులు సమయానికి స్పందించి ఉండే తన కుమార్తె బతికేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఢిల్లీ పోలీసుల దర్యాప్తు సరైన దిశగానే సాగుతోందన్నారు.