Sunday, October 6, 2024

మధ్యప్రాచ్యంలో మారణహోమం

- Advertisement -
- Advertisement -

చిలికి చిలికి గాలి వానలా మారిన చందంగా చిన్నచిన్న దాడులతో, మాటల తూటాలతో ప్రారంభమైన ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య సంఘర్షణ పెనుయుద్ధానికి దారితీసే విధంగా మారింది. ఇజ్రాయెల్ చర్యలకు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన ఇరాన్ ఎట్టకేలకు జూలు విదిల్చి కదన రంగంలోకి పరుగులు తీసింది. వందలాది క్షిపణులతో ఇజ్రాయెల్ మీద దాడులకు తెగబడింది. లెబనాన్‌లోకి చొచ్చుకుపోయి దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ హెజ్బొల్లా స్థావరాలను ధ్వంసం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. ఇజ్రాయెల్ హెజ్బొల్లాను మట్టికరిపించడానికి తీవ్రమైన దాడులకు తెగబడడమే కాకుండా హెజ్బొల్లా, హమాస్ నేతలను చంపడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేక పోయింది.

హమాస్ అధిపతి ఇస్మాయిల్ హనియే, హెజ్బొల్లా అధినేత నస్రల్లా హత్యలకు ప్రతీకారంగా ఇరాన్ వందలాది క్షిపణులతో ఇజ్రాయెల్‌పై విరుచుపడడం, ప్రతీకార దాడులకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇజ్రాయెల్‌ను హెచ్చరించడం, దీనికి బదులుగా ఇజ్రాయెల్ తాము ఇరాన్‌ను కోలుకోలేనంత దెబ్బ తీస్తామని హుంకరించడం శాంతి కాముకులను తీవ్రమైన కలవరపాటుకు గురిచేసింది. ఇరాన్ క్షిపణి దాడులు చేస్తుందని అమెరికా ఇజ్రాయెల్‌కు ముందస్తు సమాచారమందించినా ఇజ్రాయెల్ సరిగా స్పందించలేదనే చెప్పాలి. గతంలో గాజాలో ఇజ్రాయెల్ జరిపిన మారణహోమంలో పసి పిల్లలతో సహా అనేక మంది అమాయక ప్రాణాలు బలి అయ్యారు. గత సంవత్సరం ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన అనూహ్యమైన దాడులే ఇజ్రాయెల్ ఆగ్రహానికి కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఈ దాడుల్లో అనేక మంది ఇజ్రాయెల్ సైనికులు, పౌరులు చనిపోయారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇజ్రాయెల్ గాజా లో రక్తపాతం సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ విరామం లేకుండా విద్రోహుల ఏరివేతకు ఇజ్రాయెల్ బహుముఖ వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతున్నది. హమాస్ విషయంలో దూకుడు ప్రదర్శించిన ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో కూడా ఇదే పంథా అనుసరించింది. ఇప్పటివరకు మాటలతో సరిపెట్టిన ఇరాన్ తమనేమీ చేయలేదని ఇజ్రాయెల్ భావించింది. కాని ఇరాన్ ఎదురు తిరిగే సరికి ఇజ్రాయెల్ వెన్నులో వణుకుపుట్టింది. అమెరికా అండతో హెజ్బొల్లాపై దాడులను తీవ్రతరం చేసి లెబనాన్ లోకి చొచ్చుకుపోయింది. ఇరాన్ ప్రతీకార దాడులతో ఇజ్రాయెల్‌ను నిశ్చేష్టపరిచింది. మధ్యప్రాచ్యంలో మారణ హోమం హోరెత్తిపోతున్నది. యుద్ధాలతో విసుగెత్తిన ప్రజలంతా ఇరాన్, ఇజ్రాయెల్ ధోరణుల పట్ల ఆందోళన చెందుతున్నారు. సిరియా, గాజా, లెబనాన్లు ఇజ్రాయెల్ దాడులతో భీతిల్లుతున్నాయి.

హమాస్, హెజ్బొల్లాల వైఖరి తో ప్రజలు విసిగిపోతున్నారు. టెల్‌అవీవ్, జెరూసలేం నగరాలపై ఇరాన్ క్షిపణులతో దాడులు చేస్తుంటే అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్నది.ప్రతీ యుద్ధం వెనుక ఆమెరికా ప్రత్యక్ష, పరోక్ష హస్తం ఉండడం గమనార్హం. మిడిల్ ఈస్ట్ దేశాల్లో సౌదీ అరేబియా, ఇరాన్, ఈజిప్టు, టర్కీ, ఇరాక్, యుఎఇ, జోర్డాన్‌లు అత్యధిక జనాభా గల దేశాలు. సౌదీ అరేబియా అత్యధిక చమురు నిల్వలతో, యునైటెట్ అరబ్ ఎమిరేట్స్‌లు ఆర్ధిక బలంలో అగ్రగామిగా ఉన్నాయి. కేవలం కోటి జనాభా గల ఇజ్రాయెల్, 9 కోట్ల జనాభా గల ఇరాన్‌తో పోటీపడగలదా? అనే సందేహం సహజం. జనాభా పరంగా చిన్న దేశమైనా ఆయుధ బలంలోను, సాంకేతిక పరిజ్ఞానంలోను ఇజ్రాయెల్ ప్రపంచంలో ఒక ప్రబలమైన శక్తిగా అవతరించింది. ఇరాన్ ఆర్ధిక బలం చమురు క్షేత్రాలు. ఇరాన్ ధైర్యం అణుస్థావరాలు.

ఈ రెండింటినీ నాశనం చేస్తే ఇరాన్ ఆర్ధికంగా దెబ్బ తింటుందని ఇజ్రాయెల్ భావిస్తున్నది. ఒకప్పుడు ఇజ్రాయెల్ అంటే గిట్టని దేశాలు ఆ దేశం ఉనికిని గుర్తించడానికే వెనకంజవేసిన తరుణంలో ఇరాన్ ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించి చమురు సరఫరా చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్‌లు చాలా కాలం మిత్రదేశాలుగా ఉన్నాయి. యూదులు, ముస్లింలు ఇజ్రాయెల్‌లో మెజారిటీ మతస్తులు కాగా, కేవలం రెండు శాతం జనాభాతో క్రైస్తవులు మైనారిటీలుగా మనుగడ సాగిస్తున్నారు. ఇజ్రాయెల్ ఆవిర్భావ సమయంలో పలు ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించాయి. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్‌కు ముస్లిం దేశాల అండలేదు. ఇస్లాం వ్యాప్తి వలన ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ వైపు రష్యా, చైనా లాంటి దేశాలు మొగ్గు చూపితే, అగ్రరాజ్యమైన అమెరికా, దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్‌కు అండగా నిలబడి, హోరాహోరీగా యుద్ధం చేసే అవకాశాలున్నాయని కొన్ని వార్తా కథనాలు చెబుతున్నాయి.

ఒక వైపు రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం జరుపుతుంటే, మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రష్యా ఇరాన్ వైపు నిలబడే అవకాశముంది. అమెరికా ప్రత్యక్షంగా ఇజ్రాయెల్‌కు సహకారమందించడం వలన గతంలో మాదిరిగానే ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయే అవకాశముంది. ఇరాన్, ఇజ్రాయెల్ బలాబలాల విషయానికొస్తే ఇజ్రాయెల్ చిన్న దేశమైనా, ఆయుధ బలం మెండుగానే ఉంది. గగనతల దాడుల విషయంలో ఇజ్రాయెల్ శక్తిసామర్ధ్యాలను తక్కువగా అంచనా వేయలేం. అమెరికా మద్దతు ఇజ్రాయెల్‌కు అపరిమితమైన బలాన్ని అందిస్తున్నది. ఇరాన్ ఇజ్రాయెల్ కంటే ఆర్ధికంగాను, ఆయుధ పరంగాను ఉచ్ఛస్థితిలో ఉన్న మాట వాస్తవం. చమురుతో పాటు వ్యవసాయం, సేవా రంగాలు, తయారీ రంగం ఇరాన్ ఆర్ధిక వ్యవస్థకు ఆలంబనగా నిలుస్తున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం వలన ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశముంది.

రష్యా భారత్ కు చమురును సరఫరా చేయడంలో ముందంజలో ఉంది. ఇరాక్ భారత్‌కు రెండవ ప్రధాన చమురు సరఫరాదారుగా ఉండడంతో చమురు విషయంలో భారత్ కొంత వరకు భద్రంగానే ఉన్నట్టు భావించవచ్చు. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణ వలన పశ్చిమాసియా దేశాలకు భారత్ చేసే ఎగుమతులు స్తంభించిపోవచ్చు. ఇరాన్‌తో భారత్‌కు చిరకాలంగా సన్నిహిత సంబంధాలున్నా, వాణిజ్య సంబంధాలున్నా ఇరాన్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వం భారత్ పట్ల సరైన ధోరణిలో ప్రవర్తించడం లేదు. భారత్‌కు ఇజ్రాయెల్‌తో వాణిజ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయి. గత ప్రభుత్వాలు పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహరించినా, ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్ పట్ల సానుకూల దృక్పథం ప్రదర్శించడం ఇరాన్‌కు కంటగింపుగా మారింది. భారత్‌కు మిత్రదేశమైన రష్యా ఇరాన్‌కు మద్దతునిస్తూ ద్విముఖ వ్యూహం అవలంబిస్తున్నది.

అమెరికా ఎప్పటికీ చైనా ఆధిపత్యాన్ని సహించలేదు. ఒక మిత్రదేశం రష్యా, మరో శత్రు దేశం చైనా ఇరాన్‌కు మద్దతుగా నిలిచే అవకాశముంది. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్‌కు ఆర్ధిక, ఆయుధ సహకారం అందిస్తూ ప్రత్యక్షంగా రష్యా పై తిరుగుబాటు జెండా ఎగరేసింది. భారత్, చైనాలు తటస్థంగా ఉండిపోయాయి. ఇరాన్ విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబించే అవకాశాలున్నా, చైనా మాత్రం రష్యాతో పాటుగా ఇరాన్‌కు తోడుగా నిలిచే అవకాశముంది. కొన్ని ముస్లిం దేశాలు ఇరాన్- ఇజ్రాయెల్ విషయంలో ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తాయో తెలియదు. గ్లోబలైజేషన్ వలన వాణిజ్య ప్రయోజనాల కారణంగా ప్రతి దేశం గతంలో మాదిరిగా గుడ్డిగా ఏ దేశాన్ని సమర్ధించే సాహసం చేయకపోవచ్చు. ప్రతి దేశం తమ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి, ఆర్ధిక ఇబ్బందులను కోరి తెచ్చుకునే పరిస్థితులు లేవు. కొన్ని మీడియా హౌస్‌లు వెలువరిస్తున్న కథనాలను ఆధారంగా చేసుకుని, ఇరాన్- ఇజ్రాయెల్‌ల మధ్య జరిగే ఘర్షణలు మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చునని చెప్పడం కూడా కేవలం ఊహాజనితమే.

మూడవ ప్రపంచం యుద్ధం జరిగితే ఏమవుతుందో యుద్ధోన్మాద దేశాలకు సైతం తెలుసు. అలాగే ఏ దేశం కూడా అణ్వస్త్ర ప్రయోగాలు జరిపే సాహసం చేయకపోవచ్చు. శత్రుసైన్యాలను మట్టుబెట్టడం, అమాయక ప్రజలను చంపడం, ఆర్ధిక పునాదులను ధ్వంసం చేసి తమ అహాన్ని తృప్తిపరచుకోవడమే ఇరాన్ ఇజ్రాయెల్ ల మధ్య చెలరేగిన యుద్ధోన్మాద చర్యల ప్రధాన ఉద్దేశం. అయితే ఈ యుద్ధం వలన పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశముంది. యుద్ధాల వలన కలిగే దుష్పరిణామాల దృష్ట్యా ప్రపంచ దేశాలు అప్రమత్తంగా మెలగాలి. యుద్ధాలను నిలువరించడంలో పెద్దరికం ప్రదర్శించవలసిన అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ కారణంగానే ఈ ఆధునిక యుగంలో కూడా ఆటవికంగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఈ ధోరణి మారాలి. యుద్ధోన్మాదం అంతరించాలి. ప్రపంచంలో శాంతి సుస్థిరతలు వెల్లివిరియాలి.

సుంకవల్లి సత్తిరాజు
9704903463

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News