Sunday, November 17, 2024

తెలుగురాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఘర్షణ

- Advertisement -
- Advertisement -

Conflict between Telangana and AP fishermen

 

మనతెలంగాణ/హైదరాబాద్ : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలోని కృష్ణానది వద్ద తెలుగురాష్ట్రాల మత్స్యకారుల మధ్య చోటుచేసుకున్న వివాదం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారుల మధ్య రింగ్ వలలు, అలిమి వలల వివాదం కొనసాగుతోంది. ఈ విషయమై ఈనెల 29న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు రాష్ట్రాలకు చెందిన మత్సకారులు పరస్పరం రాళ్లతో దాడికి పాల్పడ్డారని చందంపేట ఎస్‌ఐ యాదయ్య తెలిపారు. ఎపికి చెందిన మత్స్యకారులు నల్గొండ జిల్లా చందంపేట మండలం శివారులో కృష్ణానది సరహద్దులో ఉన్న ఏలేశ్వరం గుట్ట వరకు వచ్చి రింగ్ వలలు వేసి చేపల వేట కొనసాగిస్తున్నారు.

ఈ వలలతో చిన్న చిన్న చేప పిల్లలు సైతం మృత్యువాత పడుతున్నాయని దీంతో చేపలవేట ఇబ్బందిగా మారిందని పలుమార్లు తెలంగాణ మత్స్యకారులు ఎపి మత్స్యకారులను హెచ్చరించారు. అయినప్పటికీ ఎపి మత్స్యకారులు రింగ్ వలల వేటను కొనసాగిస్తుండటంతో ఇరువురి మధ్య చెలరేగిన గొడవ తారస్థాయికి చేరుకొని ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న చందంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎపికి చెందిన నలుగురు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఎపి రైట్ బ్యాంక్ పోలీసులకు అప్పగించినట్లు ఎస్‌ఐ యాదయ్య మీడియాకు తెలిపారు.

రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు 

నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో ఎపి, తెలంగాణ మత్స కారులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. అంతటితో ఆగకుండా ఇరు రాష్ట్రాల మత్స్యకారులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. రింగ్ వలలతో వేట విషయలో ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి పరస్పరం రాళ్లతో దాడులలో ఎపికి చెందిన పలువురు మత్స్యకారులకు గాయాలు అయ్యాయి. అదే సమయంలో ఎపికి చెందిన ఆరుగురు మత్స్యకారులను తెలంగాణ మత్స్యకారులు నల్గొండ జిల్లా చందంపేటకు తీసుకెళ్లిపోయారు. సమాచారం అందుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి వెళ్లి ఎపి మత్స్యకారులను విడిపించుకుని వెళ్లారు. రింగ్ వలలు వేయొద్దంటూ నల్గొండ జిల్లా మత్స్యకారులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నా ఎపి మత్సకారులు పట్టించుకోవడం లేదని, ఎపి మత్స్యకారులు మొండిగా రింగ్ వలలు వేస్తున్నారంటూ తెలంగాణ మత్సకారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమనిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News