Monday, December 23, 2024

టిఎన్జీఓ ఉద్యోగుల సంఘంలో మరోసారి బయటపడ్డ విబేధాలు?

- Advertisement -
- Advertisement -

టిఎన్జీఓ ఉద్యోగుల సంఘంలో మరోసారి బయటపడ్డ విబేధాలు?
మామిళ్ల రాజేందర్ రాజీనామాతో పదవుల కోసం పోటీ పడుతున్న పలువురు నాయకులు
మామిళ్ల రాజేందర్ అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదంటూ గతంలోనే కోర్టుకు…
కొత్తగా ఎన్నికలు నిర్వహించేలోపు స్టే ఆర్డర్ తీసుకొచ్చిన మాజీ ఉద్యోగ సంఘం నాయకుడు
ప్రస్తుతం ఎవరికీ వారే అధ్యక్ష, కార్యదర్శి పదవి కోసం పోటాపోటీ!
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎన్జీఓ ఉద్యోగుల సంఘంలో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. ఈ ఏప్రిల్ జరిగిన టిఎన్జీఓ సంఘం ఎన్నికలకు సంబంధించి కోర్టు స్టే విధించడంతో మరోసారి జరగాల్సిన టిఎన్జీఓ ఉద్యోగుల సంఘం ఎన్నికలు వాయిదాపడ్డాయి. ప్రస్తుత టిఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో మరోసారి టిఎన్జీఓ సంఘం ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆ పదవి కోసం పలువురు టిఎన్జీఓ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు గతంలో టిఎన్జీఓ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిచేసిన రాయకంటి ప్రతాప్, ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా టిఎన్జీఓ అధ్యక్షుడు ముజీబ్‌హుస్సేనీ, భాగ్యనగర్ టిఎన్జీఓ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ, మారం మారం జగదీశ్వర్‌లు టిఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శి పదవుల కోసం పోటీపడుతున్నారు.

ప్రస్తుతం ఈ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఈసీ సమావేశం గురువారం నిర్వహించాలని టిఎన్జీఓ నాయకులు భావించగా గురువారం ఈ ఎన్నికలకు సంబంధించి స్టే విధించడంతో ఈసీ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 31వ తేదీ వరకు ఎలాంటి ఎన్నికలు, ఈసీ సమావేశం జరపవద్దని కోర్టు పేర్కొనడంతో సభ్యులంతా సైలెంట్ అయిపోయారు. అయితే 5 రోజుల క్రితం ప్రస్తుత టిఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రత్యక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలన్న ఉద్ధేశ్యంతో తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో పలువురు ఆశావహులు టిఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శి పదవుల కోసం పోటీపడుతున్నారు.

రాజేందర్ రాజీనామాతో ఇబ్బందికర పరిస్థితి
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో టిఎన్జీఓ సంఘం ఎన్నికలు జరగ్గా రెండోసారి అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా మారం జగదీశ్వర్‌లు ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికలు చెల్లవంటూ టిఎన్జీఓ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు టిఎన్జీఓ అధ్యక్షుడిని తానేనంటూ 19 మందితో కొత్త కార్యవర్గాన్ని ప్రతాప్ అప్పట్లోనే ప్రకటించుకున్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్‌లో మరోసారి ఎన్నికైన మామిళ్ల రాజేందర్ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా మారం జగదీశ్వర్‌లు వ్యవహారిస్తున్నారు. ఇంతలోనే మామిళ్ల రాజేందర్ 5 రోజుల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం టిఎన్జీఓ సంఘానికి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతలోనే కోర్టు ఎన్నికలకు సంబంధించి స్టే విధించడంతో అయోమయ పరిస్థితి ఏర్పడింది.

సత్యనారాయణ ఎపి ఎన్జీఓ నాయకుడంటూ..
ఒకవేళ ఈ సంవత్సరం ఏప్రిల్ జరిగిన ఎన్నికలు చెల్లవంటూ హైకోర్టు తీర్పు ఇస్తే ప్రస్తుతం మారం జగదీశ్వర్ ఎన్నిక చెల్లదని, టిఎన్జీఓ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ అధ్యక్షుడిగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఉద్యోగ సంఘం నాయకులు పేర్కొంటున్నారు. అయితే ప్రధాన కార్యదర్శి పదవి కోసం మాత్రం భాగ్యనగర్ టిఎన్జీఓ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ, టిఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌హుస్సేనీలు పోటీ పడుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న మారం జగదీశ్వర్‌కు అధ్యక్ష పదవి ఇవ్వొద్దని పలువురు టిఎన్జీఓ జిల్లాల నాయకులు మామిళ్ల రాజేందర్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలిసింది.

ఒకవేళ మారం జగదీశ్వర్‌కు అధ్యక్ష పదవి ఇవ్వకున్నా, ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలు చెల్లవంటూ కోర్టు తీర్పు ఇచ్చినా మారం జగదీశ్వర్‌కు పదవి గండం తప్పదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికలు ప్రస్తుతం రసవత్తరంగా మారాయని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అయితే భాగ్యనగర్ టిఎన్జీఓ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ కూడా ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీ పడుతుండడంతో మిగతా జిల్లాల నాయకులు ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పదవి ఇవ్వొద్దని, ఆయన ఎపి ఎన్జీఓ నుంచి వచ్చిన నాయకుడని పలు జిల్లాల నాయకులు ఆయనకు పదవి ఇచ్చే విషయంలో వ్యతిరేకిస్తున్నట్టుగా తెలిసింది.

33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల నిర్ణయం మేరకు నడుచుకుంటా: సత్యనారాయణ
అయితే ఈ విషయమై భాగ్యనగర్ టిఎన్జీఓ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల నిర్ణయం మేరకు నడుచుకుంటానని, తనకు టిఎన్జీఓ సంస్థ తల్లిలాంటిదని అలాంటి సంస్థలో తనకు కూడా భాగస్వామ్యం ఉంటుందని కానీ, అందరి కోరిక మేరకు తాను పోటీ చేస్తానని పేర్కొనడం గమనార్హం.

ఏదైనా కోర్టు తీర్పు ప్రకారం వ్యవహారించాలి:రాయకంటి ప్రతాప్
టిఎన్జీఓ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన స్టే ప్రకారం ఈనెల 31వ తేదీ వరకు ఎలాంటి సమావేశాలు నిర్వహించొద్దన్నారు. ఒకవేళ కోర్టు గతంలో జరిగిన ఎన్నికలు చెల్లవని తీర్పు ఇస్తే అధ్యక్ష పదవికి తానే అర్హుడినన్నారు. ఏదైనా సంఘం కోర్టు తీర్పు ప్రకారం వ్యవహారించాలని ఆయన సూచించారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారికి అవకాశం: ముజీబ్
33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఎవరిని ఏకగ్రీవంగా ఆమోదిస్తే వారికి అవకాశం ఇవ్వాలని హైదరాబాద్ టిఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌హుస్సేనీ పేర్కొన్నారు. సంస్థ ప్రయోజనాలతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేసే వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థ ప్రయోజనాలను దెబ్బతీయకుండా అందరినీ కలుపుకు పోయే వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News