Friday, November 15, 2024

రైతు భరోసాపై కాంగ్రెస్‌లో అయోమయం

- Advertisement -
- Advertisement -

పోలింగ్‌కు ముందే గందరగోళానికి దారితీసిన పిసిసి చీఫ్ రేవంత్ వ్యాఖ్యలు

సోషల్ మీడియాతో పాటు రైతాంగంలోనూ చర్చ

కాంగ్రెసొస్తే రైతుబంధు ఖతమే : బిఆర్‌ఎస్

మన తెలంగాణ/ హైదరాబాద్:  బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతుబంధు పథకానికి దీటుగా రైతు భరోసా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీలో ఆ పథకం అమలు తీరుతెన్నులపై అయోమయం కనిపిస్తోంది. ముఖ్యంగా కౌలు రైతుల విషయంలో స్పష్టత కొరవడినట్టుగా అవగతమవుతోంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కు ఇచ్చిన ఇంటర్వూలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతు భరోసా అమలుపై వెలిబుచ్చిన అభిప్రాయం అటు పట్టాదారులు, ఇటు కౌలు రైతులతో పాటు పరిశీలకులను అయోమయానికి గురిచేస్తోంది.

రైతు భరోసా కింద నగదు పంపిణీ పట్టాదారులతో పాటు కౌలు రైతుకు కూడా వర్తింపజేస్తామని రేవంత్ రెడ్డి తొలుత వ్యాఖ్యానించారు. అంటే అందరికీ వర్తింపజేయబోతున్నారా? అని ప్రొఫెసర్ నాగేశ్వర్ తిరిగి ప్రశ్నించడంతో రేవంత్ కొంత తటపటాయిస్తూ అందులో వస్తే ఇందులో రాదు..ఇందులో వస్తే అందులో రాదు, భూమిలేని ఉపాధి హామీ కూలీలకు కూడా రైతు భరోసా నిధులు ఖాతాలో పడుతాయని అస్పష్టమైన సమాధానం ఇచ్చి దాటవేశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో రైతు భరోసా అమలుపై కాంగ్రెస్‌కు ఒక నిశ్చితమైన విధానం అంటూ లేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చూస్తే స్పష్టమవుతోందని పెద్ద ఎత్తున కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికార బిఆర్‌ఎస్ కూడా తీవ్రంగా స్పందించింది. రేవంత్ అభిప్రాయంతో కూడిన వీడియో క్లిప్‌ను అధికారిక ‘ఎక్స్’(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే రైతుబంధు ఖతమేనని మండిపడింది.

అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. రైతుభరోసా అసలు పట్టాదారులుకా, కౌలుదారులుకా అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారిందని, క్లారిటీ లేని హామీలు ఇలా ఉంటాయని బిఆర్‌ఎస్ నాయకులు దుయ్యబడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News