Monday, December 23, 2024

కమలంలో ఆగని పదవుల మంట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర బిజెపిలో తాజా పరిణమాణాలతో గందరగోళం.. అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. ఏ నాయకుడిని పలకరించిన అంతా ఆయోమయంగా ఉందని సమాధానాలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఏమి జరుగుతోందో.. అధిష్టానానికి ఎలాంటి నివేదికలు వెళ్తున్నాయో.. జాతీయ నేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. తమకేమి అర్థం కావడం లేదని కొందరూ సీనియర్ నేతలు వాపోతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని తొలగించడం.. అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించడం జరిగిపోయినప్పటికి ఈ గందరగోళ పరిస్థితులు, అసంతృప్తులు చల్లారినట్లుగా భావించడానికి వీలు లేదని…ఇప్పుడున్న ప్రతిష్టంభన పరిస్థితులు రానున్న రోజుల్లో సరికొత్త సంక్షోభానికి దారి తీస్తాయని ఆ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండ నాలుకకు మందువేస్తే.. ఉన్న నాలుక పోయినట్లుగా పార్టీలో నెలకొన్న అసంతృప్తులను తొలగించాలని అధిష్టానం చేసిన ప్రయత్నాలు కాస్తా వికటించి..

సరికొత్త వర్గ రాజకీయాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని దూకుడుగా నడిపించి అధికారాన్ని హస్తగతం చేసుకునే దరిదాపుల వరకు తీసుకెళ్లిన బండి సంజయ్‌ని పక్కనబెడితే.. మళ్లీ అదే ఊపుతో బండి సంజయ్ పనిచేస్తాడని తాము భావించడం లేదని, తప్పకుండా సంజయ్ పార్టీ కార్యకలపాలల్లో చురుకుగా పాల్గొనే అవకాశం లేదని పార్టీ శ్రేణులు వాపోతున్నారు. ఇది పార్టీకి నష్టాన్ని కలిగిస్తుందే తప్ప.. ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యవహార శైలి బిజెపికి మేలు చేయడం కంటే కూడా ప్రత్యర్థులకు ప్రయోజనం చేకూరుస్తాయని, అందుకు కిషన్‌రెడ్డి మెతక వైఖరితో పాటు ఎక్కడిక్కడ రాజీ ధోరణులను ప్రదర్శించే వ్యక్తిత్వత్తం ఉన్న వ్యక్తి కావడం రానున్న ఎన్నికలలో కమలానికి ప్రయోజనం కంటే.. నష్టాన్ని కలిగిస్తాయని కొందరూ సీనియర్ నాయకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ అధ్యక్ష పదవీ నుంచి బండి సంజయ్‌ను తొలగించిన విధానంపై ఆయన తీవ్ర మనస్థాపానికి లోనయ్యారని, అధిష్టానం తనను అవమానించిందని సంజయ్ పలువురు నేతలతో తన ఆవేదనను పంచుకున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి పదవిని వదులుకోవడానికి కిషన్‌రెడ్డికి ఎలా ఇష్టం లేదో.. రాష్ట్ర అధ్యక్ష పదవీని వదలుకోవడానికి బండి సంజయ్‌కి కూడా ఇష్టం లేదని, ఈ ఇద్దరు నేతలు ఇక నుంచి అయిష్టంగానే తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలల్లో పార్టీకి మేలు చేస్తుందా.. కీడు చేస్తుందో.. మీరే ఆర్థం చేసుకోవాలని ఆ నేతలు వ్యాఖ్యానించారు.
శ్రేణుల్లో కనిపించని జోష్ ..
మరోవైపు కొత్త అధ్యక్షుడిని నియమిస్తూ పార్టీ హైకమాండ్ ఆదేశించినా జిల్లా, రాష్ట్ర స్థాయి నేతల్లో, పార్టీ శ్రేణులలో జోష్ కనిపించ లేదు. రాష్ట్ర పార్టీ కార్యాలయం బుధవారం బోసిపోయింది. కటౌట్లు, ఫ్లెక్సిలు, హడావుడి, హంగామా, సందడి.. ఇలాంటివేవీ కానరాలేదు. పార్టీలో నేతల మధ్య అంతరం అదే స్థాయిలో కొనసాగుతోంది. శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రెండు ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా గెలుపు కోసం పనిచేయాలన్న ఉత్సాహం శ్రేణుల్లో కనిపించడం లేదు. సంచలనం రేపిన పార్టీ నేత రఘనందన్‌రావు చిట్‌చాట్ వ్యవహారం.. పార్టీలో సీనియర్ నేతలు విజయశాంతి, వివేక్, జితేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డికె అరుణ, బూర నర్సయ్యగౌడ్, కొండ విశ్వేశ్వర్‌రెడ్డి.. వారి స్థాయిలో నిరుత్సాహం. నైరాశ్యం వ్యక్తమవుతున్నది.

వేగంగా మారుతున్న మార్పులు..
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చాక కిషన్ రెడ్డి తీరు పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతున్నది. మంగళవారం నుంచి ఆయన మీడియాతో పాటు కేబినెట్ సమావేశానికి సైతం కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కిషన్ రెడ్డి అలిగారా? కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారా? అనే సందేహాలు వ్యక్త వుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర అధ్యక్షుడిగా తనను నియమించడం పట్ల కిషన్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. పార్టీ బాధ్యతల కన్నా కేంద్ర మంత్రిగా కొనసాగడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడి.. సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనకు పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఈటల రాజేందర్‌తో పాటు పార్టీ ముఖ్యనేతలు ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News