హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు పులిపాటి రాజేశ్ లోక్ సభ ఎన్నికల్లో మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై పోటీచేయబోతున్నారు. ఆదివారం ఆయన తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఆయన ఇదివరలో బహదూర్ పురా నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశారు. ఆయన పద్మశాలి కులానికి చెందిన వ్యక్తి, అడ్వొకేట్. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనని అధికారికంగా తమ అభ్యర్థి అని ప్రకటించలేదు. ‘బి’ ఫామ్ కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ నాయకత్వం డిసిసి ఛీఫ్ సమీర్ వలీవుల్లాహ్ ను హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించొచ్చని భోగట్ట.
దీనికి ముందు బిఆర్ ఎస్ పార్టీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను, బిజెపి మాధవీ లతను అసదుద్దీన్ పై పోటీకి తమ అభ్యర్థులుగా నిలబెట్టాయి. హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని మజ్లీస్ పార్టీ 1989 నుంచి వరుసగా తొమ్మిది సార్లు గెలుచుకుంది. ఇక అసదుద్దీన్ ఓవైసీ 2004 నుంచి హైదరాబాద్ ఎంపీగా ఉంటున్నారు. ఇప్పుడాయనకు పోటీ తీవ్రంగా ఉంది.