Saturday, November 23, 2024

జాక్ డోర్సీ వ్యాఖ్యలపై మోడీ సర్కార్ జవాబివ్వాలి: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రైతుల నిరసనల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తమపై బెదిరింపులకు పాల్పడిందంటూ ట్విట్టర్ మాజీ సిఇఓ జాక్ డోర్సీ చేసిన వ్యాఖ్యలపై ఎన్‌డిఎ ప్రభుత్వం జవాబివ్వాలని కాంగ్రెస్ పార్టీ మంగళవారం డిమాండ్ చేసింది.

రైతులు, రైతు ఉద్యమానికి చెందిన ఖాతాలను, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న జర్నలిస్టుల ఖాతాలను మూసేయాలని, తమ ఆదేశాలను పాటించని పక్షంలో ట్విట్టర్‌పైన, దాని ఉద్యోగుల ఇళ్లపైన పైన దాడులు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం తనను బెదిరించినట్లు ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సిఇఓ జాక్ డోర్సీ సోమవారం ఒక టివి ఇంటర్వూలో వెల్లడించారని, దీనికి మోడీ ప్రభుత్వం సమాధానమిస్తుందా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జీవాలా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బ్రేకింగ్ పాయింట్స్ అనే యుట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూను యువజన కాంగ్రెస్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యుఐ) ట్విట్టర్‌లో షేర్ చేశాయి.

బిజెపి ప్రజాస్వామ్య హంతకురాలని, ఇది మరోసారి నిరూపితమైందని ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు నీరజ్ కుందన్ ఆరోపించారు.
విదేశీ ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఒత్తిడైనా ఎదుర్కొన్న సందర్భం ఉందా అని ఇంటర్వూలో అడిగిన ప్రశ్నకు జాక్‌డోర్సీ జవాబిస్తూ ఉదాహరణకు భారత్‌లో రైతుల ఆందోళన జరుగుతున్న సమయంలో రైతుల ఖాతాలను, రైతుల ఉద్యమాలకు చెందిన ఖాతాలను, ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుల కాతాలను మూసివేయాలని తనను భారత ప్రభుత్వం ఆదేశించిందని, తమ ఆదేశాలను పాటించని పక్షంలో మీ ఉద్యోగుల ఇళ్లపై దాడులు జరుపుతామని బెదిరంచి అదే పని చేసిందని డోర్సీ తెలిపారు. ఇది ప్రజాస్వామిక దేశమైన భారత్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

కాగా..శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కూడా బిజెపిపై మండిపడ్డారు. రైతుల నిరసనలను అణచివేయడానికి బిజెపి, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాయని, రైతుల ఉద్యమాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు అవి ప్రయత్నించాయని, రైతులను ఉగ్రవాదులుగా, దేశ ద్రోహులుగా ముద్ర వేసేందుకు ప్రయత్నించాయని, రైతులపై లాఠీచార్జి చేశాయని, రైతులు చనిపోయేలా చేశాయని, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు ప్రయత్నించాయని, సోషల్ మీడియా వేదికలపై అక్రమ కేసులు బనాయించాయని, ఇన్ని చేసినా రైతులు తమ నిరసనల ద్వారా ప్రభుత్వం మెడలు వంచారని ఆమె పేర్కొన్నారు. ఇది భారతీయ ప్రజాస్వామ్యమా లేక మోడియోక్రసీ పాలనా అని ఆమె ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News