న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు వ్యతిరేకంగా ఏర్పాటయ్యే జాతీయ కూటమిలో ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు కీలక పాత్ర ఉంటుందని ఆర్‌జెడి నేత తేజస్వీయాదవ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపితో 200కుపైగా సీట్లలో ముఖాముఖి తలపడే పార్టీగా కాంగ్రెస్‌ను చూడాలని ఆయన హితవు పలికారు. తాను పోటీ చేసే సీట్లపైనే కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టాలని, మిగతా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలకు డ్రైవర్ స్థానం ఇవ్వాలని తేజస్వీ సూచించారు. ఢిల్లీలోని శరద్‌పవార్ నివాసంలో గత మంగళవారం కాంగ్రెసేతర పార్టీలతో నిర్వహించిన సమావేశంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
కేంద్రంలోని ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనీస ఉమ్మడి కార్యక్రమంతో భావసారూప్య పక్షాలన్నీ ఐక్యం కావాలని ఆయన సూచించారు. 2014లోనే దేశం ఇలాగే కొనసాగాలా లేదా విభజించబడాలా అనేది తేల్చే ఎన్నికలుగా ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్(తేజస్వీ తండ్రి)హెచ్చరించారని, ఇప్పుడు పలు పార్టీలకు అది అర్థమైందని తేజస్వీ అన్నారు. ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్ కూడా ప్రత్యామ్నాయ కూటమికి కాంగ్రెస్ అవసరమున్నదని అనడం గమనార్హం. కాంగ్రెస్ లేకుండా జాతీయ కూటమి అసంపూర్ణమని శివసేన ఎంపి సంజయ్‌రౌత్ ఉద్ఘాటించారు.
Cong should be fulcrum in national front: Tejashwi Yadav