Friday, December 20, 2024

జెకె ప్రజలకు కాంగ్రెస్ 5 గ్యారంటీలు

- Advertisement -
- Advertisement -

ఫరూఖ్ అబ్దుల్లా సమక్షంలో ఖర్గే ప్రకటన
మహిళా పారిశ్రామికవేత్తలకు రూ. 5 లక్షలు వడ్డీ లేని రుణం
కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా

అనంతనాగ్ (జెకె) : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జమ్మూ కాశ్మీర్ ప్రజల కోసం ఐదు గ్యారంటీలను బుధవారం ప్రకటించారు. కేంద్ర పాలిత ప్రాంతం జెకెలో కాంగ్రెస్ ఎన్‌సి కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే మహిళా పారిశ్రామికవేత్తలకు రూ. 5 లక్షల వడ్డీ రహిత రుణం, కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా మంజూరు చేయనున్నట్లు ఖర్గే వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ పట్టణంలో కూటమి అభ్యర్థుల తరఫున ఖర్గే ప్రచారం చేస్తూ, కుటుంబాల మహిళా అధిపతులకు నెల నెలా రూ. 3000ను కాంగ్రెస్‌ఎన్‌సి ప్రభుత్వం ఇవ్వగలదని, ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా మనిషికి 11 కిలోల ధాన్యాల సరఫరా పథకాన్ని పునరుద్ధరించగలమని వాగ్దానం చేశారు.

కాశ్మీరీ పండిట్ శరణార్థుల పునరావాసానికి మన్మోహన్ సింగ్ హయాంలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చనున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఒబిసిలకు రాజ్యాంగంలో పొందుపరిచిన వారి హక్కులు లభించగలవని ఆయన చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లా, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతల సమక్షంలో ఖర్గే ఐదు గ్యారంటీలను చదివి వినిపించారు. కాంగ్రెస్ నేతల్లో కెసి వేణుగోపాల్, సుబోధ్ కాంత్ కూడా ఉన్నారు. జెకెకు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణకు పార్టీ కృషి చేస్తుందని పునరుద్ఘాటించిన ఖర్గే కేంద్ర పాలిత ప్రాంతానికి రెండు శాసనసభల వ్యవస్థ పునరుద్ధరిస్తామని వాగ్దానం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News