ఆ స్థానానికి పోటీలో గాంధీల గైర్‌హాజర్ ఇందుకు నిదర్శనం
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
అమేథీలో నామినేషన్ వేసిన ఇరానీ
అమేథీ (ఉత్తర ప్రదేశ్) : అమేథీలో ఎన్నికల బరిలో నుంచి గాంధీలు తప్పుకోవడం పోలింగ్‌కు ముందే కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకున్నట్లు సూచిస్తోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం వ్యాఖ్యానించారు. అమేథీ సిట్టింగ్ ఎంపి స్మృతి ఇరానీ విలేకరులతో మాట్లాడుతూ, ‘అమేథీ స్థానంలో ఎన్నికల బరిలో గాంధీ కుటుంబం లేకపోవడం పోలింగ్‌కు ముందే నియోజకవర్గంలో తన పరాజయాన్ని కాంగ్రెస్ ఒప్పుకున్నట్లు సూచిస్తోంది’ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విధేయుడు కిశోరి లాల్ శర్మ అమేథీ స్థానానికి నామినేషన్ వేయడంపై స్మృతి ఇరానీ ఆ విధంగా స్పందించారు. బిజెపి నేత స్మృతి ఇరానీ గాంధీ కుటుంబం గురించి ప్రస్తావిస్తూ, ‘ఆ స్థానంలో గెలిచేందుకు ఏమాత్రం అవకాశం ఉందని వారు భావించినా వారు ఇక్కడి నుంచి పోటీ చేసి ఉండేవారు, తమ ప్రాక్సీని నిలబెట్టి ఉండేవారు కాదు’ అని అన్నారు.
అమేథీ నియోజకవర్గంలో తాను మళ్లీ గెలుస్తానని ఆమె స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఈ నెల 20న పోలింగ్ జరగనున్నది. శుక్రవారం రాయబరేలీ నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ‘అమేథీ అంగీకరించని, వయనాడ్‌కు పారిపోయిన వ్యక్తి రాయబరేలీకి ఎన్నడూ పూర్తి చెందడు’ అని అన్నారు. ‘వయనాడ్‌లో అది తన కుటుంబం అని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆయన రాయబరేలీలో ఏమి చెబుతారు’ అని స్మృతి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మూడు పర్యాయాలు అమేథీ నుంచి ఎంపిగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన విజయ పరంపరను స్మృతి ఇరానీ అడ్డుకున్నారు. ఆమె 55 వేలకు పైగా వోట్ల ఆధిక్యంతో రాహుల్‌ను ఓడించారు.
‘మహాఘనుని ఓడించిన నేత’గా స్మృతి ఇరానీకి ప్రశంసలు లభించాయి. ఇరానీ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అమేథీలో ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వం కింద అభివృద్ధిని చూశారని, గడచిన 50 ఏళ్లలో అలా ఎందుకు జరగలేదని వారు ప్రశ్నించవలసి వస్తోందని అన్నారు. ‘గాంధీ కుటుంబం ఆ ప్రాంతానికి అంత అధికంగా ఎందుకు నష్టం కలిగించారని వారు ప్రశ్నిస్తున్నారు’ అని ఆమె తెలిపారు. ‘వయనాడ్‌లో పోలింగ్ తరువాత రాహుల్‌జీ కొత్త సీటు కోసం చూస్తారని ప్రధాని ఇదివరకే జోస్యం చెప్పారు. ఈరోజు అది జరగడాన్ని మీరు చూస్తున్నారు’ అని స్మృతి ఇరానీ అన్నారు. రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి సిట్టింగ్ ఎంపి, ఆయన ఈ ఎన్నికల్లో ఆ స్థానానికి తిరిగి పోటీ చేశారు.