హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ విజయం సాధిస్తోందని పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఫుల్ మెజారిటీ వస్తుందని రాష్ట్ర నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం నేతలను అప్రమత్తంగా ఉండమని హెచ్చరించింది.
కౌంటింగ్ కు ముందు అధ్యర్థులు ఎవరూ చేజారకూడదని, ఎలాంటి ప్రలోభాలకు లోంగకుండా ఉండేందుకు అధిష్టానం చర్యలకు సిద్ధమైంది. పార్టీ అభ్యర్థులందరినీ హైదరాబాద్ కు రప్పించాలని హోటల్ తాజ్ కృష్ణలో అభ్యర్థులకు ఎఐసిసి ప్రతినిధులు సూచించినట్లు తెలుస్తోంది. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు జరగనుంది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని మూడో దఫా పాలనకు ఓటర్లు మొగ్గుచూపుతున్నారా లేక కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు ఏమైనా అద్భుతాలు చేశాయా అన్నది చూడాల్సిఉంది. డిసెంబర్ 30న జరిగిన ఎన్నికలలో 2,290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.