Monday, December 23, 2024

బిజెపి, కాంగ్రెస్‌ల అత్యాశ

- Advertisement -
- Advertisement -

 

Congress and bjp focus on telangana

మన ప్రధాన మంత్రి మోడీ, బి.జె.పి. పార్టీ దేశాధ్యక్షులు జెపి నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాంటి ప్రముఖులు హైదరాబాద్‌కు వచ్చారు, వెళ్లారు. వీరు వచ్చింది ఇంకో సంవత్సరన్నర కాలంలో తెలంగాణలో, రెండేళ్లలో దేశంలో జరిగే అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికల్లో తాము గెలవడానికి జరుపుతున్న విజయ సంకల్పయాత్రలో భాగం. ఏ ఎన్నికల్లో అయినా గెలువాలంటే సెంటిమెంట్లను రెచ్చగొట్టడం, ఇతరు వైఫల్యాలపై ఆధారపడటం, ఎలాగైనాసరే బాధ్యతా రహితంగానైనా ప్రవర్తించి గెలిచి తీరాలనుకోవడం బి.జె.పి. లాంటి పార్టీలు చేసేపని. ప్రజలపట్ల, దేశం పట్ల ప్రేమతో ప్రజోపయోగకరమైన పథకాలు ప్రవేశపెట్టడం, శాశ్వతంగా మిగిలిపోయే పనులు చేసి ఓట్లడగటం టిఆర్‌ఎస్ లాంటి పార్టీలు చేసేపని.

దేశాన్ని అప్పులఊబిలో ముంచి, ప్రభుత్వరంగ సంస్థలను విధ్వంసం చేసి, నిరుద్యోగాన్ని, పేదరికాన్ని పెంచి ఎనిమిదేళ్ళలో ప్రజోపయోగకరమైన ఒక్కపని కూడా చేయకుండా దేశానికే రోల్ మోడల్‌గా నిలిపిన తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్‌ను విమర్శిస్తూ గెలువాలని చూడటం విడ్డూరంగానే ఉంది. తెలంగాణ బిజెపి నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ప్రధానమంత్రి, ఇతర కేంద్ర నాయకులు హిందీలో చదివిన విషయాలను గమనిస్తే కేంద్రానికి కెసిఆర్‌పై అక్కసు, అసూయాద్వేషాలు తప్ప తెలంగాణ గురించి చిన్నమెత్తు అవగాహన కాని, ఎనిమిదేళ్లుగా జరుగుతున్న అభివృద్ధిపై కించిత్ జ్ఞానం కాని లేవని అర్ధమవుతుంది. కెసిఆర్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను 90 శాతానికి పైగా పూర్తి చేశారన్న విషయం తెలంగాణ ఓటర్లకు దేశం, ప్రపంచ మంతటికీ తెలుసు. రాష్ట్ర, కేంద్ర బిజెపి నాయకులకు తెలిసినా తెలియనట్టు నటిస్తారు. తెలంగాణ అభివృద్ధి నమూనాను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నా బిజెపి నాయకులు మాత్రం విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంటారు.

Congress and bjp focus on telangana

నీళ్ళు, నిధులు, నియామకాలు సాధించడం ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నడిపిన కెసిఆర్ ఈ ఎనిమిదేళ్ళ పాలనలో వాటిని నూటికి నూరు పాళ్లు సాధించారన్న వాస్తవాన్ని బిజెపి నాయకులు ఒప్పుకోరు. ఒప్పుకుంటే తెలంగాణలో అడుగుపెట్టడానికి కూడా అవకాశం లేదన్న వాస్తవం బిజెపికి తెలుసు. అందుకే ప్రధాన మంత్రి, కేంద్ర నాయకులు కెసిఆర్‌ను ఒక్క మాట కూడా తిట్టకుండా, రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ తిట్ల పురాణంతో ప్రసంగాలు కొనసాగించారు. కెసిఆర్ ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి నీళ్ళు, నిధులు, నియమకాలు ఏమీ సాధించలేదని గోబెల్ ప్రసంగాలు చేస్తున్నారు, చేశారు, చేయబోతున్నారు. ఈ గోబెల్ ప్రచారంతో తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాననుకోవడం లోటపిట పెదవులకు నక్కఆశ పడ్డట్టుగానే ఉంది. ఎంతో అందనంత ఎత్తున ఉన్న ఒంటె పెదవులను ఎగిరి అందుకొని తినగలిగే శక్తి నక్కకు లేదు. వదులుగా ఊగుతూ ఉన్నట్టు కనబడినా ఆ పెదవులు ఎన్నటికీ రాలవు. ఎంత కాచుకొని ఎదురు చూస్తున్నా, నక్కజిత్తులు వేసినా, ఆ పెదవులను నక్క ఎన్నటికీ తినలేదు. తెలంగాణలో బిజెపి గెలుపు ఆశ కూడా నక్కకాశలాంటిదే.ఎందుకంటే తెలంగాణ బాహుబలి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఈ ఎనిమిదేళ్లలో ఎన్ని ఎత్తులకెదిగిందో తెలంగాణ ప్రజల హృదయాల్లో కెసిఆర్‌కు ఎంత చోటుందో ఓటేసే ప్రజలకు బాగా తెలుసు.

ఇక బిజెపివాళ్ళు చెప్పిన నీళ్ళ గురించి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్నే జలసిరి గల రాష్ట్రంగా, ఎండా కాలంలోనూ గోదావరిలో, తెలంగాణ చెరువుల్లో జలకళ గల రాష్ట్రంగా మార్చిన ఘనత కాళేశ్వరం, దాని అనుబంధ ప్రాజెక్టులు అనిత కాలంలో నిర్మించిన కెసిఆర్‌దే. నీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల నెర్రెలు బాసున్న నేలలు తడిబారి పూట పండయ్యాయి. రాష్ట్రమంతటా కాళేశ్వరం నీళ్ళు అందటం వల్ల ఇప్పటికే 40 లక్షల ఎకరాలు సాగుభూమి పెరిగింది. త్వరలో తెలంగాణ నీటి వసతి సాగు భూమి కోటి ఎకరాలవుతుంది. చెరువుల్లో పూడిక తీసే మిషన్ కాకతీయ వల్ల చెర్లలో నీళ్ల నిల్వలు పెరిగి ప్రతి ఊళ్లో సాగుభూమి పెరిగింది. ఒకసారి చెరువు నిండితే రెండు పంటలు పండగా అశిని కార్తికి మిగిలేన్ని నీల్లుంటున్నాయి. ఎండా కాలంలోనూ చెర్లు, కుంటలు, గోదావరి బర్పూర్గా ఉండటం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. తాగునీరు లేక గొంతెండిపోతున్న తెలంగాణ ప్రజలకు భగీరథ నీళ్ళు దాహాన్ని తీరుస్తున్నాయి.

బావుల్లో చెలిమల్లో నీళ్ళుచెంబుతో ముంచుకోగలిగేంతపైకి వచ్చాయని సామాన్యులు చెబుతారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో మంచినీటి కొరకు కి.మీ. దూరం పోవాల్సిన అవసరముంది. ఉత్తరప్రదేశ్‌లో దళితుల ఆర్ధిక పరిస్థితి, నీటి పరిస్థితి మరీ అధ్వానం. తెలంగాణకు నీళ్ళవాటా ఇవ్వడంలోను కేంద్రం అనేక ఇబ్బందులు పెడుతున్నా రాష్ట్ర తాగునీటి, సాగునీటి సమస్యను స్వల్పకాలంలోనే తీర్చగలిగింది తెలంగాణ ప్రభుత్వం.తమ ప్రభుత్వం పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇవేవీ చేయకుండా, దేశ వ్యాప్తంగా ఒక్క భారీ నీటి ప్రాజెక్టును నిర్మించకుండా ఎన్నికల ప్రధాన వాగ్దానమైన నీటి సమస్యను అవలీలగా తీర్చిన కెసిఆర్‌ను విమర్శించడం ప్రధాన మంత్రి హోదాకు సరైంది కాదు. తాగునీటితో గొంతులు తడుపుకుంటూ, సాగు నీటితో భూములు తడుపుకుంటూ, రైతు పథకాలతో వ్యవసాయాన్ని పండుగ చేసుకుంటున్న తెలంగాణ ప్రజలముఖాల్లోని ఆనందోత్సాహాలు బిజెపి నాయకులు గమనించాలి.

బిజెపికి కొరకురాని కొయ్యలా మారిన కెసిఆర్‌ను ఇబ్బందుల పాలు చేయాలని బిజెపి పన్నాగం. ఎవరికి చెందాల్సిన వాటా వారికివ్వడం కేంద్రం బాధ్యతయితే దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించకుండా ఉండటం రాష్ట్రాల బాధ్యత. తెలంగాణ రాష్ట్రం తన బాధ్యతను సరిగ్గానే నిర్వహిస్తుంది. కాని కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి భంగం కల్పించేలా ప్రవర్తిస్తున్నది. కేంద్రం తెలంగాణకు నిధులివ్వడం ఎలా ఉందంటే ఈతాకిచ్చి తాటాకు దొబ్బినట్టుంది. మా ఇంటికొస్తే నాకేం తెస్తవు మీ ఇంటికొస్తే నాకేం ఇస్తవు అన్నట్టు ప్రవర్తిస్తున్న బిజెపికి. సవాలుగా నిల్చోని ఎదుర్కొంటున్నాడు కెసిఆర్. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకున్నా రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచడంలో, తలసరి ఆదాయాన్ని పెంచడంలో ముందున్నారు.ఇతర రాష్ట్రాలవారే కాకుండా విదేశీయులు, ఎన్‌ఆర్‌ఐలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెడ్తున్నారు.

వ్యసాయం, పరిశ్రమలు, ఐటి ఫార్మా, ఎక్సైజ్, సగటు ఆదాయాన్ని పెంచడం, భూముల రిజిస్ట్రేషన్లు, ఇనకంమ్ టాక్స్ పన్నుల వసూళ్లను క్రమబద్ధీకరించడం లాంటి అనేక చర్యల ద్వారా తెలంగాణను ధనిక రాష్ట్రంగా మార్చడంలో ముందున్నారు. 8 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 60 వేల కోట్ల నుండి 2 లక్షల కోట్లను దాటిందంటే నిధులు చేకూర్చడంలో తెలంగాణ ఎంత ముందుందో అర్ధమవుతుంది కదా! ఇలా మోడీ, బిజెపి నాయకులు చేస్తున్న నిధుల ఆరోపణ గోబెల్ ప్రచారంలో భాగమని ప్రతి తెలంగాణ పౌరుడికీ తెలుసు. ఇక నియామకాలు విషయంలో బిజెపి ఆరోపణలు మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పేరుతో లక్షలాది మందిని ఇంకా చెప్పాలంటే కోట్ల మందిని ఉద్యోగాల నుంచి తొలగించి రోడ్లపై నిలబెట్టిన మోడీ ప్రభుత్వం తెలంగాణలో నియామకాలగురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అత్యధిక జనాభాకు ఆదాయమార్గాలైన వ్యవసాయం, వృత్తిపని వారికి చేతినిండా పని, ఆదాయ మార్గాలను పెంచారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వేలాది ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు, ఐటి పరిశ్రమలను గణనీయంగా స్థాపించడం ద్వారా లక్షలాది ఉద్యోగాలు, సాంఘిక సంక్షేమ విద్యాలయాల ద్వారా వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. మోడీ కార్పొరేట్ అనుకూల, పిడికెడు మందిని లక్ష కోటీశ్వరులను చేసి మెజారిటీ ప్రజలను పేదలను చేసే గుజరాత్ మోడల్ కంటె రైతు, వృత్తి పనులు, మెజారిటీ ప్రజల అనుకూల, రాష్ట్రాన్ని దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దిన తెలంగాణ మోడల్ ప్రజోపయోగకరమైంది. దీన్ని దేశమంతా ఆమోదిస్తుంది. కెసిఆర్ ఆదర్శ తెలంగాణ అభివృద్ధి మోడల్ చూస్తూ కూడా గోబెల్ ప్రచారంతో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూడటం ఆకాశానికి నిచ్చెన వేసినట్టే ఉంది. ఇది అత్యాశ మాత్రమే కాదు దురాశ కూడా. బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను గమనిస్తే తెలంగాణ అన్ని రంగాల్లో ఎంత ముందుందో అర్ధమవుతుంది.

డా॥కాలువ మల్లయ్య
9182918567

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News