మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు కలలు కనడం తప్ప ఉమ్మడి జిల్లాలో పార్టీ రోజు రోజుకు కుదేలవుతు క్యాడర్‌లో అమోమయం నెలకొన్న చక్కదిద్దే నాయకుడు లేకుండా పోయారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కీలకమైన పార్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఇక్కడ పూర్తిగా చేతులు ఎత్తేసి రాష్ట్రంలోని మిగత జిల్లాల్లో పోరు యాత్రలు నిర్వహిస్తుంది. 2018 ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూర్, మహేశ్వరం, ఎల్.బి.నగర్ నియోజకవర్గాలతో పాటు మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానంలో సైతం విజయం సాధించిన వలసలతో పార్టీ ప్రస్తుతం పూర్తిగా డీలాపడింది. పిసిసి అధ్యక్షుడిగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి రావడంతో జిల్లాలో పార్టీ పరుగులు పెడుతుందని అశీంచిన ఇప్పటివరకు ఆ స్థాయిలో ఉమ్మడి జిల్లా పార్టీలో జోష్ నింపిన దాఖలాలు మాత్రం లేకుండా పోయాయి.
రేవంత్ కోటరి దాటి బయటకు వచ్చి పార్టీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని క్షేత్రస్థాయిలో కనీసం పట్టు లేని కొంత మంది రేవంత్ రెడ్డి చుట్టు చేరి అంతా బాగుంది అన్న భ్రమ కల్పిస్తు పార్టీని మరింత భ్రష్ర్టు పట్టిస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలసలతో కుదేలైన పార్టీలో కొన్ని నియోజకవర్గాలకు నాయకత్వం లేకపోగా మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకులు ఎక్కువ క్యాడర్ తక్కువ అనే వాతావరణం కనిపిస్తుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో మినహ మిగత ఏ నియోజకవర్గంలో కూడ పార్టీకి పటిష్టమైన నాయకత్వం లేదంటే పార్టీ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. పిసిసి పిలుపుకు స్పందించి మొక్కుబడి కార్యక్రమాలు నిర్వహించి పత్రిక ప్రకటనలు రాయించుకునే దానిలో పోటిపడుతున్న నాయకగణం ప్రజా సమస్యలపై పోరు బాట పట్టడంలో కాని ఉమ్మడి జిల్లాలో పార్టీని పటిష్టం చేసే పని మాత్రం ఏక్కడ చేస్తున్న దాఖలాలు లేవు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు తప్ప ఇతర ప్రాంతాలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. జిల్లా పార్టీ అధ్యక్షులు నియోజకవర్గాలకు, కొన్ని వార్డులకు పరిమితం అవుతున్నారు తప్ప జిల్లా స్థాయిలో పార్టీకి తాము బాస్‌లమని, జిల్లా పార్టీని తాము నడిపించాలన్న సంగతి మర్చిపోయారు.
అభ్యర్ధులు ఎక్కువ..పని చేసే వారు తక్కువ…
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు డీలాపడుతుంది. బిఆర్‌యస్, బిజెపిలు ఎన్నికల రణరంగంలోకి దూకి దూకుడుగా ముందుకు పోతుంటే హస్తంలో మాత్రం వర్గపోరుకు పరిమితం అయింది. మహేశ్వరం నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సింహరెడ్డి, సీనియర్ నాయకుడు దేపా భాస్కర్ రెడ్డిలు ఇప్పటివరకు టికెట్ రేసులో ఉండగా తాజాగా బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహరెడ్డి తెరపైకి రావడం ఎవరికి టికెట్ వచ్చిన మిగత వారు కారు ఎక్కడమో….కమలం గూటికి చేరడమో తప్పదు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్.బి.నగర్ నియోజకవర్గాల్లో పార్టీని ముందుండి నడిపించే నియోజకవర్గ స్థాయిలో దమ్మున్న నాయకత్వం లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి ఇంటి చుట్టు తిరుగుతు జై జై కొట్టే నాయకత్వం ఇక్కడ చాలా ఉన్న క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తు పార్టీని ముందుకు తీసుకుపోవడంలో కాని బిఆర్‌యస్‌కు దీటుగా తలపడే వారు కాని లేరన్నది కఠోర వాస్తవం. మేము పోటి చేస్తామనే వారు ప్రతి నియోజకవర్గంలో భారీగానే ఉన్న పోటిచేస్తే బూత్ స్థాయిలో పనిచేసే వారు..
మీకు ఓటు వేసి గెలిపించే వారు మాత్రం లేరు. చెవెళ్ల నియోజకవర్గంలో మండలానికి ఒకరిద్దరు శాసనసభ అభ్యర్దులు ఉండగా వలస నేతలు సైతం మరో ఇద్దరు ముగ్గురు పోటిచేస్తామని తిరుగుతున్న పార్టీని నడిపించే నాయకత్వం మాత్రం లేదు. షాద్‌నగర్‌లో ఇద్దరు నేతల అంతర్గతపోరుతో ఉన్న వారు సైతం కారు ఎక్కుతున్నారు. కల్వకుర్తిలో బడానేత డిల్లీలో తప్ప గల్లీలో పార్టీని పట్టించుకునే వాతావరణం లేదు.సార్ వస్తే హడావిడి పోతే సైలెన్స్ తప్ప పార్టీ కార్యక్రమాలు తుచ్ మాత్రమే. ఇబ్రహింపట్నంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గంగా మల్ రెడ్డి రంగారెడ్డి, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గంలో నిరంజన్ రెడ్డిలతో పాటు మరి కొంత మంది నేతలు తామే అభ్యర్దులమంటు ఎవరికి వారే యమున తీరే అన్న చందంగా పార్టీ పరిస్థితి. వికారాబాద్‌లో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, పరిగిలో మాజీ ఎమ్మెల్యే టిఆర్‌ఆర్ అన్ని తామై ముందుకు సాగుతున్నారు. తాండూర్ కాంగ్రెస్‌కు నాయకత్వం కరువైంది. పిసిసి ఉపాధ్యక్షుడు రమేష్ మహరాజ్ ఉన్న పేరుకు తప్ప పార్టీకి పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. స్థానిక కౌన్సిలర్‌లు పార్టీని వదిలి కారు ఎక్కుతున్నారు. రేవంత్ రెడ్డి అడ్డా కొడంగల్ సైతం పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే.
మేడ్చల్ జిల్లాలో: ఐదు నియోజకవర్గాలు ఉన్న ఎక్కడ కూడ పార్టీని సమర్దవంతంగా ముందుకు నడిపించే నాయకత్వం కరువైంది. ఐదు నియోజకవర్గాలు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపిగా వ్యవహరిస్తున్న పార్టీ పరిస్థితి మాత్రం ఎక్కడ కూడ పోటి ఇచ్చే పరిస్థితులలో కనిపించడం లేదనేది బహిరంగ రహస్యమే. మేడ్చల్ నియోజకవర్గంలో హరివర్దన్ రెడ్డి, జంగయ్య యాదవ్ లతో పాటు మరో ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ ఆశీస్తున్నారు. ఉప్పల్‌లో సైతం ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ రేసులో ఉన్నారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో నాయకత్వం అంతంత మాత్రమే. మల్కాజ్‌గిరిలో గతంలో పరాజయం పాలైన శ్రీదర్ మరోసారి బరిలో ఉండే చాన్స్ ఉన్న బిఆర్‌యస్, బిజెపిలతో తట్టుకుని నిలబడే వాతావరణం కనిపించడం లేదు.