మనతెలంగాణ/హసన్‌పర్తి: గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ పరిధిలోని చిన్నగంటూరుపల్లి, పెగడపల్లి గ్రామాల నుండి కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన సుమారు వంద మందికిపైగా నాయకులు, యువకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎంఎల్‌ఎ ఆరూరి సమక్షంలో ఆదివారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా డివిజన్ ప్రెసిడెంట్ నరెడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వడిచర్ల నవీన్‌రెడ్డి, గాదె అమర్‌రెడ్డి, ఆయాజ్, వంశీ, నాగరాజు, చందు తదితరులకు ఎంఎల్‌ఎ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎంఎల్‌ఎ ఆరూరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. దేశ ప్రజలు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వైపు చూస్తున్నారన్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చి వారి అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.