Wednesday, January 22, 2025

కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఒక తాను ముక్కలే

- Advertisement -
ఎవరు ఎవరికి ‘బి టీమ్’ అనేది ప్రజలకు తెలుసు : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : బిజెపి ఎదుగుదలను అడ్డుకునేందుకు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని ఓ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో అధికారంలోకి వచ్చాం.. తెలంగాణలోనూ వస్తాం అని చెప్పుకుంటున్నారు. పథకాలు ప్రకటించడం.. వాటి పేరుతో స్కామ్ లు చేయడంలో మీరు ఆరితేరారు. తెలంగాణలో బిజెపి ఖతం అంటున్న వారి పరిస్థితేంటో.. నాలుగు నెలల్లో ప్రజలు తేలుస్తారు’ అని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ, బిఆర్‌ఎస్ పార్టీ ఒక తాను ముక్కలేనని ఆయన అన్నారు. తెలంగాణలో ఎవరికి ఎవరు బి టీమో ప్రజలకు బాగా తెలుసన్నారు. పార్టీ నడపలేక చేతులెత్తేసిన రాహుల్ గాంధీ.. బిజెపిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.

ఖమ్మం సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాతో గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చేతకాని నాయకులు.. తెలంగాణలో అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్నారన్నారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కలిసి కుట్ర చేయలేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మోడీని ఎదుర్కునేందుకు విపక్షాలన్నీ పార్లమెంటులో సమావేశమైన సందర్భంలో.. రాహుల్ పక్కన కేశవరావు కూచుని గుసగుసలాడిన విషయం వాస్తవం కాదా? దీన్ని ప్రపంచం మొత్తం చూడలేదా? అని ఆయన అన్నారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి గిరిజన బిడ్డను గెలిపించుకోవాలని.. ద్రౌపది ముర్ముని మోడీ బరిలోకి దించినపుడు.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ అభ్యర్థిని పిలిపించి.. బేగంపేట నుంచి ఊరేగించి.. ఊరంతా ఫ్లెక్సీలు పెట్టించి.. కార్లతో భారీగా ర్యాలీ తీసి.. మీటింగ్ పెట్టి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దుతగా మోదీని తిట్టి నానా హంగామా చేసింది బిఆర్‌ఎస్ పార్టీ కాదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరితో ఎవరికి దోస్తీ.. ఎవరికి ఎవరు ‘బి టీమ్’ అనేది దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. 2004లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీచేయడం, రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఇరు పార్టీలు మంత్రిపదవులు పంచుకోవడం తెలంగాణ ప్రజలకు ఇంకా గుర్తుందన్నారు. ఉమ్మడి పౌరస్మృతి మీద కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ స్టాండ్ ఏంటో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నెల 8న వరంగల్‌కు ప్రధానమంత్రి రానున్న సందర్భంలో.. రైల్వే వ్యాగన్ ఉత్పత్తి యూనిట్‌కు, రూ.5,500 కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరిగే బహిరంగ సభను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారని ఆయన తెలిపారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News