Thursday, January 23, 2025

కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని బిజెపి నేత,మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత మూడు నెలల్లో భారతదేశ జీడీపీ ఎనిమిది శాతానికి పెరిగిందని, ఇది రాత్రికి రాత్రి జరిగినది కాదని దీని వెనుక కేంద్రం, మోడీ కృషి ఎంతో ఉందన్నారు. సంక్షేమ పథకాలంటే ప్రజలకు మంచి జరిగేలా ఉండాలని కానీ ఉచితాలు, కులాల వారీగా ఇస్తామని మభ్య పెట్టేలా ఉండకూడదన్నారు.

ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గతంలో ఉన్న సర్కార్‌తో పోల్చి చూస్తే నయమేనన్నారు. బిఆర్‌ఎస్ ఉన్నప్పుడు అసెంబ్లీలో బూతులు వాడే వారని, ఈసారి అసెంబ్లీ కొంత హుందాగా నడిచిందని ఇది సంతోషించదగ్గ విషయమన్నారు. కొత్త ప్రభుత్వం చేతిలో బిఆర్‌ఎస్ చిప్ప పెట్టి పోయిందని, రైతుబంధు, ఇతర పథకాలకు డబ్బులు లేవన్నారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలో లేకపోయినా తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. నలుగురు ఎంపీలు ఉన్నప్పుడే ఇన్ని నిధులు ఇస్తే, ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే ఎన్ని నిధులు వస్తాయో ఆలోచించాలన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధికి నిధులు కేటాయించారని పేర్కొన్నారు. మాజీ సిఎం కెసిఆర్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్తే, ప్రజలు ఇబ్బందులు పడకూడదని కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. ఇన్ని అప్పులు ఉన్నా పథకాలు కొనసాగుతున్నాయంటే దానికి కారణం మోడీ అన్నారు.

తెలంగాణలో 14, 15 ఎంపీ సీట్లు గెలిపిస్తే తొమ్మిది లక్షల కోట్లు కాదు, రూ. 25 లక్షల కోట్లు తీసుకొస్తామన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటే అని దుష్ప్రచారం చేస్తున్నారని, మేం కూడా కాంగ్రెస్‌పై అసత్య ప్రచారం చేసే అవకాశముందన్నారు. కానీ అలా చేయమని కాళేశ్వరం మొత్తాన్ని విడిచిపెట్టి మేడిగడ్డ ఒక్కదాన్ని మాత్రమే పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఇది ఆవును వదిలిపెట్టి తోకను పట్టుకున్నట్లు ఉందని, రాజకీయం కోసం మేడిగడ్డ సమస్యను వాడుకుంటున్నారని మండిపడ్డారు.

కవితను అరెస్ట్ చేయకపోవడంతో బిఆర్‌ఎస్‌తో కుమ్మక్కు అయ్యామని విమర్శలు చేయడం నిజం కాదన్నారు. కెసిఆర్ కుటుంబంపై చర్యలకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ అధిష్టానం ముందుకు సాగనివ్వడం లేదన్నారు. చేవెళ్లలో రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. నాకు టికెట్ ఇస్తారని ఇప్పటి వరకు ఎవరూ నమ్మకంగా చెప్పలేదన్నారు. గతంలో పని చేసినట్లే ఇపుడు కూడా పని చేస్తున్నానని తెలిపారు. గతంలో పది గంటలు పని చేసేవాడినని, ఎన్నికల సందర్భంగా 16 గంటలు పని చేస్తున్నానని తెలిపారు.

అనంతరం చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఇస్తానన్న గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అందజేయాలని, కృష్ణా, గోదావరి జలాలు రంగారెడ్డి జిల్లాకు అందలేదన్నారు. చేవెళ్లకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని, ప్రస్తుతం ఎంపి అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో రోడ్లు ఏమాత్రం బాగాలేవని, రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిరణ్ గౌడ్, అజ్మీరా బాబీ, రాంరెడ్డి, బొక్కా నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News