Thursday, January 9, 2025

అసంతృప్తిలో వామపక్షాల నాయకులు

- Advertisement -
- Advertisement -

అడిగిన సీట్లను ఇవ్వని కాంగ్రెస్ !
నల్లగొండ సిపిఐ జిల్లా కార్యదర్శి అలక
సిపిఎం పార్టీలోనూ అదే సీన్

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్, వామపక్షాల మధ్య జరిగిన పొత్తులో వామపక్షాల నాయకులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. సిపిఐతో పొత్తు ఇప్పటికే ఓకే అయ్యిందని ఆ పార్టీకి రెండు సీట్లను చెన్నూరు, కొత్తగూడెంలను కేటాయించామని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం తమ అగ్రనాయకుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. సిపిఐ మునుగోడు సీటుపై పట్టువీడలేదని, ఇదే విషయాన్ని తమ ఢిల్లీ నాయకుల వద్ద  ప్రస్తావించినా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇదే విషయమై కాంగ్రెస్ అధిష్టానానికి సిపిఐ జాతీయ నేత డి.రాజా ఫోన్ చేసినట్లుగా సమాచారం. అయితే మునుగోడు సీటుకు బదులు చెన్నూరు, కొత్తగూడెం సీట్లను ఖరారు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు ఆయనతో పేర్కొన్నట్టుగా తెలిసింది.
సిపిఎం అడిగిన రెండు స్థానాలు కాంగ్రెస్ వారికే…
అయితే సిపిఐ పరిస్థితి ఇలా ఉంటే ఇప్పటివరకు సిపిఎం పార్టీతో పొత్తులు ఖరారు కాలేదని తెలుస్తోంది. మొదటి నుంచి సిపిఎం అడిగిన భద్రాచలం స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థి పొదెం వీరయ్యను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో సిపిఎం కేడర్ నిరుత్సాహంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సిపిఎం నేతలతోనూ కాంగ్రెస్ నాయకులు పొత్తు గురించి చర్చిస్తున్నట్లుగా సమాచారం. చర్చలు సఫలం అయితే ఆ పార్టీకి కూడా రెండు సీట్లు కేటాయించి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ సెకండ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా వామపక్షాలు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో ఆరు అసెంబ్లీ స్థానాల సీట్లు అడిగినట్లు తెలిసింది. దీంతో చెరో రెండు స్థానాలను వామపక్షాలు అడిగినవి కాకుండా వేరే ఇచ్చి వారితో పొత్తు ఖరారు చేసుకున్నట్టుగా తెలిసింది. అయితే భద్రాచలం, మిర్యాలగూడ, పాలేరు టికెట్‌లను సిపిఎం ఆశిస్తుండడం, ఇందులో రెండు సీట్లను తమ అభ్యర్థులకు ఇప్పటికే కాంగ్రెస్ కేటాయించడంతో సిపిఎం పొత్తుల విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
సిపిఐలో ముసలం?
సిపిఐలో పార్టీలో ముసలం ఏర్పడింది. మునుగోడు సీటు వదులుకోవడంపై నల్గొండ సిపిఐ నేతలు భగ్గుమంటున్నారు. పొత్తుల్లో భాగంగా మునుగోడు టికెట్ సిపిఐకి కేటాయించక పోవడంతో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పార్టీపై అలకబూనారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. కొత్తగూడెం కోసం మునుగోడును వదిలేశారన్న విమర్శలు చేస్తున్నారు. కమ్మ నేత కోసం బిసి నేతను బలి పశువు చేశారని నల్లగొండ జిల్లా సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News