ప్రధాని మోడీ ఆరోపణ
ఆజంగఢ్(యుపి): పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) కింద శరణార్థులకు పౌరసత్వాన్ని అందచేయడం ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ చట్టం గురించి అబద్ధాలు ప్రచారం చేస్తూ దేశంలో అల్లర్లు సృష్టించడానికి కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ(ఎస్‌పి) ప్రయత్నించాయని మోడీ ఆరోపించారు. ఆజంగఢ్‌లోని లాల్‌గంజ్ ప్రాంతంలో గురువారం ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ సిఎఎ కింద శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే పని ప్రారంభమైపోయిందని, సుదీర్ఘకాలంగా వీరంతా దేశంలో శరణార్థులుగా జీవిస్తున్నారని, మత ప్రాతిపదికన చేసిన దేశ విభజనకు వీరంతా బాధితులని అన్నారు. ఈ శరణార్థులను కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.
సిఎఎ పేరిట అబద్ధాలను వ్యాప్తి చేసేందుకు కాంగ్రెస్, ఎస్‌పి ప్రయత్నించాయని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌తోసహా దేశవ్యాప్తంగా అల్లర్ల సృష్టికి ఆ రెండు పార్టీలు ప్రయత్నించాయని ఆయన ఆరోపించారు. సిఎఎని రద్దు చేస్తామని ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన నాయకులు చెబుతున్నప్పటికీ అది ఎవరికీ సాధ్యం కాదని ప్రధాని స్పష్టం చేశారు. మీరంతా మోసగాళ్లని, మతం మంటల్లో దేశం తగలబడిపోయేందుకు మీరే కారకులని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రధాని ఆరోపించారు. మీరు ఏం చేసినా సిఎఎని మాత్రం తొలగించలేరని ఆయన తేల్చి చెప్పారు.