ఆశావహుల నుంచి టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
మొదటగా దరఖాస్తు చేసుకున్న మానవతారాయ్
సత్తుపల్లి నుంచి పోటీ చేయాలని నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు షురూ చేసింది. అందులో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి టికెట్లకు దరఖాస్తులను ఆహ్వనించింది. శుక్రవారం నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులను తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మొదటి దరఖాస్తును మానవతారాయ్ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం క్రమసంఖ్య 116కు దరఖాస్తు చేసుకొని దరఖాస్తు ఫారాన్ని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్‌కు మానవతారాయ్ అందించారు.
మొదటిరోజు మొత్తం 10 మంది ఆశావహుల టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో గాంధీభవన్‌లో టికెట్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ షురూ అయ్యింది. గోషామహాల్ నుంచి మధు, ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య, మహబూబాబాద్ నుంచి డా.మురళీ నాయక్, కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగరావు తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వచ్చిన దరఖాస్తులను టి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పరిశీలించిన అనంతరం అభ్యర్థులను ఫిక్స్ చేయనున్నారు. ఒక అభ్యర్థి ఎన్ని నియోజకవర్గాల నుంచి అయిన దరఖాస్తులు పెట్టుకోవచ్చని టి కాంగ్రెస్ తెలిపింది. ఇక, కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే బిసి, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 25 వేలు, ఓసీలు రూ. 50 వేలను దరఖాస్తుకు చెల్లించాలి.