Monday, December 23, 2024

కేంద్ర ప్రభుత్వ బుల్‌డోజ్ విధానంపై కాంగ్రెస్ మండిపాటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళించాలన్న పేరుతో మొత్తం క్రిమినల్ చట్టస్వరూపాన్ని ఎలాంటి చర్చలు లేకుండా కేంద్ర ప్రభుత్వం “బుల్‌డోజ్‌” చేస్తోందని కాంగ్రెస్ ఆదివారం మండిపడింది. ఈఉచ్చు నుంచి క్రిమినల్ చట్టస్వరూపాన్ని దూరం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయ నిపుణులు, మేథావులు, ప్రముఖుల ప్రమేయంతో కొత్త మూడు క్రిమినల్ బిల్లులపై విస్తృతంగా చర్చ జరగాలని కాంగ్రెస్ ఆదివారం పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సర్జేవాలా ఈమేరకు ఒక ప్రకటనలో ఇండియన్ క్రిమినల్ చట్టాలకు బదులు మూడు కొత్త బిల్లులను ప్రభుత్వం తీసుకువచ్చే విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈనెల 11న ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా, న్యాయనిపుణులు, న్యాయమూర్తులు, నేరశాస్త్రవేత్తలు, ఇతర భాగస్వాముల నుంచి సూచనలు ఆహ్వానించకుండా మోడీ ప్రభుత్వం తన “మాంత్రిక టోపీ” నుంచి మూడు బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిందని విమర్శించారు.

ఈ విధంగా మొత్తం దేశ నేర చట్టాల స్వరూపాలు రహస్యంగా, నిగూఢంగా, అపారదర్శక విధానంలో చట్టాలయ్యే ప్రమాదం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఈ బిల్లులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పరిచయ వ్యాక్యాలు వాస్తవానికి దూరంగా, లోతైన పరిజ్ణానం లేనివిగా, అజ్ణానాన్ని ప్రతిబింబిస్తున్నాయని రణదీప్ విమర్శించారు. ఈ నిగూఢ ఎక్సర్‌సైజు వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. బిల్లుల ద్వారా సవరించిన మార్పులని మంత్రి అమిత్‌షా అబద్ధాలు చెబుతూ తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ సెలెక్ట్ కమిటీ పరిశీలనకు ఈ బిల్లులను పంపించే ముందు ఈ బిల్లులు, వాటి లోని నిబంధనలు బహిరంగ చర్చకు తీసుకురావాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కూడా బిల్లులపై భారీ స్థాయిలో విస్తృత చర్చ జరగాలని సూచించారు. వీటిలో కొన్ని చట్టాలు, ముఖ్యంగా సిఆర్‌పిసి గురించి మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ అన్నది ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.

ఇందులో అనేక సవరణలు గతంలోజరిగాయన్నారు. ప్రతి చట్టం లోని ప్రతి నిబంధన గత వందేళ్లుగా విస్తృతంగా న్యాయవాదనలతో రూపొందినవేనని, ప్రతి నిబంధన వివరణ ఫెడరల్ కోర్టు, సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టుల తీర్పులతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. అందువల్ల పార్లమెంట్ జాయింట్ కమిటీ న్యాయవాదులు, రిటైర్డ్ జడ్జీలు, మాజీ పోలీస్ అధికారులు, మాజీ అధికారులు, న్యాయమూర్తులు, మానవ, మహిళా, పౌర హక్కుల ప్రతినిధులతో ఏర్పాటు చేసి ఈ బిల్లులపై చర్చించాలని సూచించారు. ప్రాథమిక హక్కులపై ఈబిల్లుల తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News