న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనం నిర్మాణ శైలిపై కాంగ్రెస్ పార్టీ శనివారం తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ కొత్త పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్యాన్ని, వాదసంవాదాలను చంపివేసిందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన కొత్త పార్లమెంట్ భవనాన్ని మోడీ మల్టీప్లెక్స్ లేదా మోడీ మారియట్ అని పిలిస్తే బాగుంటుందని ఆయన ఆరోపించారు. 2024లో ఈ పాలన స్థానంలో కొత్త పాలకులు వచ్చిన తర్వాత నూతన పార్లమెంట్ భవనాన్ని వేరే అవసరాలకు ఉపయోగించుకోవడం మంచిదేమోనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓంతో ఆర్భాటంగా ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని మోడీ ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని జైరాం పేర్కొన్నారు. దీన్ని మోడీ మల్టీప్లెక్స్ లేదా మోడీ మారియట్ అని పిలవాల్స ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఉభయ సభల లోపల, లాబీలలో సంవాదాలు, సంభాషణలు మాయమైనట్లు నాలుగు రోజుల సప్రత్యేక సమావేశాల అనంతరం తాను గుర్తించినట్లు ఆయన తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ శైలి ప్రజాస్వామ్యాన్నన్ని చంపివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో రాజ్యాంగాన్ని పునర్‌లిఖించక ముందే ప్రధాని నరేంద్ర మోడీ సఫలీకృతమయ్యారంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కొత్త పార్లమెంట్ భవనంలోపల సఎంపీలు ఒకరినొకరు చూసుకోవాలంటే బైనాక్యులర్లు అవసరమవుతాయని, భవనంలోని హాళ్లు అంత చీకటిగా ఉన్నాయని జైరాం వ్యాఖ్యానించారు. పాత పార్లమెంట్ భవనం ఒక అద్భుత కట్టడమని, అక్కడ ఉభయ సభలు, సెంట్రల్ హాల్, కారిడార్ల మధ్య నడక సౌకర్యం ఉండడమే కాక సభ్యుల మధ్య సంభాషణలకు అవకాశం ఉండేదని ఆయన తెలిపారు. కాని కొత్త భవనం ఇటువంటిలో సౌకర్యాలేవీ లేపోవడమేగాక దారి తప్పితే ఎక్కడకు చేరుకుంటామో తెలియని అగమ్య పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త భవనంలో ఉభయ సభల మధ్య సమన్వయం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా కొత్త పార్లమెంట్ భవనంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలను బిజెపి అధ్యక్షుడు జెడి నడ్డా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ దిగజారుడు వైఖరికి ఇది పకారాష్ట అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఇది 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను అవమానించడమేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ వ్యతిరేకత ఇది మొదటిసారి కాదని, 1975లో ప్రయత్నించి ఆ పార్టీ విఫలమైందని నడ్డా వ్యాఖ్యానించారు.