Wednesday, January 15, 2025

మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

ఇండోర్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్ సోమవారం తన నామినేషన్ పత్రం ఉపసంహరించుకున్నారు. నియోజకవర్గంలో పోలింగ్‌కు 15 రోజుల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. బమ్ తన నామినేషన్ ఉపసంహరించుకున్న అనంతరం బమ్ ఇండోర్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యాలయానికి చేరుకున్నారు.

బిజెపి సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక ఫోటోలో బమ్ మధ్య ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవ్‌డా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి కైలాష్ విజయ్‌వర్గీయ, ఇతర పార్టీ నేతలతో కలసి కనిపించారు. బమ్ బిజెపిలో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం చివరి రోజు. ఇక్కడ పోలింగ్ మే 13న జరగనున్నది. బమ్ నామినేషన్ పత్రం ఉపసంహరించుకున్నట్లు ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ ధ్రువీకరించారు. స్థానిక బిజెపి ఎంఎల్‌ఎ రమేష్ మెండోలాతో కలసి బమ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ పత్రం ఉపసంహరించుకున్నారు.

అనంతరం బమ్ మీడియా సిబ్బంది ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మెండోలాతో కారులో నిష్క్రమించారు. విజయ్‌వర్గీయకు మెండోలా నమ్మిన బంటు. ‘కాంగ్రెస్ అభ్యర్థి బమ్‌తో సహా ముగ్గురు అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఆ ప్రక్రియను వీడియో కూడా తీయడమైంది’ అని కలెక్టర్ తెలిపారు. బిజెపిలో చేరేందుకు బమ్‌ను స్వాగతిస్తున్నామని మంత్రి విజయ్‌వర్గీయ తెలియజేశారు. ‘కాంగ్రెస్ ఇండోర్ లోక్‌సభ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్ ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు విడి శర్మ నాయకత్వంలో బిజెపిలోకి స్వాగతనీయుడు’ అని విజయ్‌వర్గీయ తెలిపారు.

ఇది ఇలా ఉండగా, ఇండోర్ పత్రకార్ కాలనీలో బమ్ నివాసం వెలుపల పోలీసులను మోహరించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన నివాసం వెలుపల సమీకృతం కాసాగారు. ఎన్నికల రంగంలో కొత్తవాడైన 45 ఏళ్ల బమ్‌ను ఇండోర్ లోక్‌సభ స్థానంలో బిజెపి సిట్టింగ్ ఎంపి శంకర్ లాల్వానీపై పోటీకి కాంగ్రెస్ నిలబెట్టింది. ఇండోర్ బిజెపికి కంచుకోట. బమ్ తన రాజకీయ జీవితంలో ఇంత వరకు ఏ ఎన్నికల్లోను పోటీ చేయలేదు. ముగ్గురు పార్టీ మాజీ ఎంఎల్‌ఎలతో సహా పలువురు పార్టీ కార్యకర్తలు లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిరాయించి బిజెపిలో చేరిన సమయంలో ఇండోర్ నుంచి పోటీ చేసేందుకు బమ్‌కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News