న్యూఢిల్లీ : పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 రాజ్యాంగబద్ధతను తాము ‘అతి త్వరలో’ సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించింది. రాజ్యాంగంలో పొందుపరచిన సూత్రాలు, నిబంధనలు, పద్ధతులపై మోడీ ప్రభుత్వ ‘దాడులు’ అన్నిటినీ తాము ప్రతిఘటిస్తూనే ఉంటామని కూడా ప్రతిపక్షం తెలియజేసింది. రాజ్యసభ 13 గంటలకు పైగా చర్చ అనంతరం ఆ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించిన తరువాత బిల్లుకు శుక్రవారం తెల్లవారు జామున పార్లమెంట్ ఆమోద ముద్ర లభించినట్లు అయింది. ‘వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును మైనారిటీలనే వేధించేందుకు తీసుకువచ్చారన్న భావన కలిగేలా బిల్లుకు సంబంధించి దేశంలో వాతావరణం నెలకొన్నది.
లోక్‌సభలో రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత బిల్లును ఆమోదించినప్పుడు అనుకూలంగా 288 వోట్లు, వ్యతిరేకంగా 232 వోట్లు వచ్చాయి. ఇది ఎలా సంభవించింది? అంటే బిల్లులో అనేక లోపాలు ఉన్నాయన్న మాట’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ‘ఎక్స్’లో హిందీ పోస్ట్‌లో పేర్కొన్నారు. వివిధ పార్టీల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ బిల్లును నిరంకుశంగా తీసుకువచ్చారని దీని నుంచి ఎవరైనా ఊహించవచ్చునని ఆయన అన్నారు. ‘ఈ ‘బలమే సరైనది’ అనేది ఎవ్వరికీ మంచిది కాబోదు’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. ‘వక్ఫ్ (సవరణ) బిల్లు రాజ్యాంగబద్ధతను ఐఎన్‌సి సుప్రీం కోర్టులో అతి త్వరలో సవాల్ చేస్తుంది’ అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి సంస్థాగత ఇన్‌చార్జి జైరామ్ రమేష్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు.
‘భారత రాజ్యాంగంలో పొందుపరచిన సూత్రాలు, నిబంధనలు, పద్థతులపై మోడీ ప్రభుత్వ దాడులు అన్నిటినీ మేము ప్రతిఘటిస్తూనే ఉంటాం’ అని రమేష్ తెలిపారు. వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో చర్చలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాలు బిల్లును ‘ముస్లిం వ్యతిరేకం’గాను, ‘రాజ్యాంగవిరుద్ధమైనది’గాను పేర్కొన్నాయి. కాగా, ప్రభుత్వం బిల్లును మైనారిటీ సమాజానికి లబ్థి చేకూర్చే ‘చరిత్రాత్మక సంస్కరణ’గా అభివర్ణించింది. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు, వ్యతిరేకంగా 95 మంది వోటు వేయగా బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లును గురువారం తెల్లవారుజామున లోక్‌సభ 288232 తేడాతో ఆమోదించింది.