న్యూఢిల్లీ : పార్లమెంట్ కొత్త భవనం లోకి ఎంపీలు అడుగుపెట్టిన సమయంలో వారికి భారత రాజ్యాంగ ప్రతులను అందించారు. అయితే అందులోని పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు లేకపోవడం వివాదాస్పదమైంది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతోపాటు ఇతర పార్టీల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వాటిని తొలగించడం రాజ్యాంగంపై దాడేనన్నారు. సెప్టెంబర్ 19న ఎంపీలకు ఇచ్చిన రాజ్యాంగ కొత్త కాపీల్లోని పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు లేవు అని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పేర్కొన్నారు.
లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యే ముందు పార్లమెంట్‌ప్రాంగణంలో మీడియాతో ఆమె మాట్లాడారు. ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరి మాట్లాడుతూ ‘1976 లో చేసిన సవరణతో వాటిని రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన విషయం మనకు తెలుసు. తాజాగా ఇచ్చిన ప్రతుల్లో ఇవి లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చాలా తెలివిగా ఈ పనిచేసినట్టు అనిపిస్తోంది. ఇది ఆందోళన కలిగించే విషయం. ’ అని అన్నారు. ఇక సిపిఎం నేత బినోయ్ విశ్వమ్ మాట్లాడుతూ ఆ పదాలను తొలగించడం నేరమన్నారు.
ఒకసారి సవరణలు నోటిఫై చేసిన తరువాత పాత రాజ్యాంగాన్ని ప్రచురించకూడదని విపక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. రాజ్యాంగ ప్రతుల్లోని పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు లేకపోవడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్ స్పందించారు. అవి రాజ్యాంగ పీఠిక “ఒరిజినల్ పత్రాలు” అని పేర్కొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో అవి లేవని, 1976లో చేసిన 42 వ సవరణ ద్వారా వాటిని రాజ్యాంగ పీఠికలో చేర్చినట్టు గుర్తు చేశారు. అయితే తాజా కాపీలు అనుకోకుండా ఇచ్చారా ? లేక ఉద్దేశ పూర్వకంగానే అందించారా ? అనే విసయంపై ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.